మాజీ సీఎం కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు

– దానిపై హైకోర్టులో పిటీషన్‌
– 27లోపు వివరణ ఇమ్మన్న జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్‌)కు జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్లాంట్ల నిర్మాణంపై నిజ నిర్థారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ నర్సింహారెడ్డి ఏకసభ్య విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈనెల 27వ తేదీలోపు కమిషన్‌ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. అయితే గతంలోనే మాజీ సీఎం కేసీఆర్‌కు కమిషన్‌ నోటీసులు ఇవ్వగా, ఆయన వివరణ ఇచ్చేందుకు జులై 30వ తేదీ వరకు గడువు కోరారు. దీన్ని తిరస్కరించిన కమిషన్‌ జూన్‌ 15లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనితో ఆయన కమిషన్‌ ఏర్పాటే చట్ట విరుద్ధమనీ, జస్టిస్‌ నర్సింహారెడ్డి స్వచ్ఛందంగా విచారణ నుంచి తప్పుకోవాలంటూ సమాధానం ఇచ్చారు. దానిలోనే ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణాలపైనా పాక్షిక వివరణ ఇచ్చారు. కేసీఆర్‌ ఇచ్చిన వివరణపై కమిషన్‌ విద్యుత్‌రంగ నిపుణులతో పలుమార్లు చర్చలు జరిపింది. విచారణలో భాగంగా వారి వివరణను కూడా తీసుకుంది. విద్యుత్‌రంగ నిపుణులు లేవనెత్తిన పలు అభ్యంతరాలపై మరింత విస్త్రుతమైన వివరణ అవసరమని పేర్కొంటూ, ఆయా అంశాలను కమిషన్‌ లేఖలో పేర్కొని, మాజీ సీఎం కేసీఆర్‌ను వివరణ కోరింది. ఈ లేఖను ఈనెల 19వ తేదీనే కేసీఆర్‌కు పంపారు. దీనిపై న్యాయనిపుణులతో సుదీర్ఘ చర్చల అనంతరం కేసీఆర్‌ సోమవారం హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. అసలు కమిషన్‌ నియామకమే చెల్లదనీ, అది చట్టవిరుద్ధమని పిటీషన్‌లో పేర్కొన్నారు.
అయితే ఈ పిటీషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ పలు అభ్యంతరాలు లేవనెత్తినట్టు సమాచారం. ఆ అభ్యంతరాలను సరిచేసి మంగళవారం మరోసారి పిటీషన్‌ను దాఖలు చేసినట్టు తెలిసింది. అయితే దానికి కూడా హైకోర్టు రిజిస్ట్రార్‌ పిటీషన్‌ నెంబర్‌ ఇవ్వలేదని తెలిసింది. జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి ఏకసభ్య కమిషన్‌ ఇదే అంశంపై మాజీ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డితోపాటు మరికొంత మందికి కూడా నోటీసులు జారీ చేసింది. మరో రెండ్రోజుల్లో కమిషన్‌ ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో మాజీ సీఎం కేసీఆర్‌ వివరణ ఇస్తారా? లేక న్యాయస్థానం నుంచి అందుకు భిన్నంగా ఏవైనా ఉత్తర్వులు తెచ్చుకుంటారా అనే అంశంపై ఆసక్తి నెలకొనిఉంది.

Spread the love