త్రిపుర బీజేపీ ఎమ్మెల్యేకు నోటీసులు

– జిల్లా అధ్యక్షుడిపై కేసు నమోదు
అగర్తలా : త్రిపుర ఈస్ట్‌ లోక్‌సభా నియోజకవర్గానికి పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక పోలింగ్‌ అధికారిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేకు జిల్లా ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్‌ 26నాటి పోలింగ్‌లో ప్రిసైడింగ్‌ అధికారిపై చేయి చేసుకున్నందుకు బిజెపి జిల్లా అధ్యక్షుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని అధికారులు సోమవారం తెలిపారు.
బగాబాసా అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే లాల్‌ నాథ్‌కు ఆదివారం ఈ నోటీసులు జారీ అయ్యాయి. పోలింగ్‌ జరుగుతుంటే త్రిపుర ఈస్ట్‌ పరిధిలోని ఒక బూత్‌లోకి తన అనుచరులతో ప్రవేశించిన బీజేపీ ఎమ్మెల్యే బూత్‌ స్థాయి అధికారి చిన్మరు దాస్‌పై చేయి చేసుకున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ఉల్లంఘించి బూత్‌లోకి ఎందుకు ప్రవేశించారు, అధికారిపై ఎందుకు చేయి చేసుకున్నారో తెలియచేయాలంటూ ఎమ్మెల్యేకు జిల్లా ఎన్నికల అధికారి దేవప్రియ వర్ధన్‌ నోటీసులు జారీ చేశారు. అలాగే ఉత్తర త్రిపుర జిల్లా అధ్యక్షుడు కంజల్‌ దాస్‌, ఆయన అనుచరులు అదే బూత్‌లో ప్రిసైడింగ్‌ అధికారిపై చేయిచేసుకున్నందుకు కేసు నమోదైంది. పోలింగ్‌ రోజున సాయంత్రం 5గంటల సమయంలో పోలింగ్‌ బూత్‌ వద్ద చెల్లాచెదురుగా నిలబడిన ఓటర్లందరూ లైన్‌లో నిల్చుని టోకెన్లు తీసుకోవాలని, 5 తర్వాత ఓటు వేయడానికి ఇవి తప్పనిసరని ప్రిసైడింగ్‌ అధికారి చెబుతుండగా, అక్కడకు వచ్చిన కంజల్‌ దాస్‌, ఆయన అనుచరులు బూత్‌ నుండి ప్రిసైడ్‌ిం అధికారిని బయటకు తోసివేసి, చేయి చేసుకున్నారని సంబంధిత అధికారి తెలిపారు. వెంటనే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Spread the love