అమల్లోకి ‘ఒకే దేశం-ఒకే లైసెన్స్’ విద్యుత్ వ్యవస్థల ‘కార్పొరేటీకరణ’కు గ్రీన్‌సిగల్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలోని యావత్ విద్యుత్‌రంగాన్ని ప్రయివేటురంగంలో కార్పొరేట్లకు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని కాలరాస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి తేవాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఆర్సీ) ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇంథనశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాసింది. ఇప్పటి వరకు విద్యుత్ పనులు చేపట్టేందుకు ఆయా రాష్ట్రాల పరిధిలోనే కాంట్రాక్టర్లకు లైసెన్సులు మంజూరు చేసేవారు. దీనితో వారు టెండర్ల ద్వారా పనులు దక్కించుకొని చేపట్టేవారు. ఇప్పుడు ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం గండికొట్టింది. ‘ఒకే దేశం-ఒకే లైసెన్స్’ పేరుతో దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు తెచ్చింది. దీనివల్ల ఎక్కడో గుజరాత్‌లో లైసెన్స్ తీసుకున్న కాంట్రాక్టర్ తెలంగాణలో కరెంటు పనులు చేపట్టవచ్చు. దానికి తోడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల పోటీని చిన్న కాంట్రాక్టర్లు తట్టుకునే పరిస్థితిని కోల్పోతారు. ఆయా కార్పొరేట్ సంస్థల కింద సబ్‌కాంట్రాక్టర్లుగా లేదా వర్కర్లుగా మిగిలిపోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లైసెన్సింగ్ విధానంలో తమ హక్కును కోల్పోతాయి. ఇప్పటికే దేశంలోని అనేక విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల్ని కార్పొరేట్లకు అప్పగిస్తున్న కేంద్రప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లోని విద్యుత్ సంస్థలు మరింత కుదేలయ్యే ప్రమాదం ఉన్నదని విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యుత్ సంస్థల ఉద్యోగులు, కార్మికులు మాత్రమే ఆందోళనలబాట పట్టారు. ఈ నిర్ణయంతో విద్యుత్ కాంట్రాక్టర్లు కూడా రోడ్లపై బైఠాయించి, పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఓ గుత్తేదారు ఆందోళన వ్యక్తం చేశారు. సీఈఆర్సీ చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 29న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మెజారిటీ రాష్ట్రాల ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్లు దీనికి ఆమోదం తెలిపారని పేర్కొంది. అదే సందర్భంలో ఏ రాష్ట్రం నుంచి లైసెన్స్ తీసుకున్నా, పొరుగు రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేసుకొనేందుకు ఉన్న షరతుల్ని కూడా సడలించారు. పొరుగు రాష్ట్రాల్లో పనులు చేయాలంటే కాంట్రాక్టర్ లైసెన్స్, వర్క్‌మెన్ పర్మిట్, సూపర్‌వైజరీ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌ను మాత్రమే పరిశీలిస్తే చాలని పేర్కొన్నారు. లైసెన్సులు ఇచ్చే అధికారాన్ని అయా రాష్ట్రాల ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్లకు అప్పగించారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లోని కాంట్రాక్ట్ విధానంలో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు టెండర్లలో కొంత శాతం ఇవ్వాలనే షరతులు ఉన్నాయి. కేంద్రం తెచ్చిన ఒకే దేశం-ఒకే లైసెన్స్ విధానంతో వీటికి గండిపడే అవకాశాలు ఉన్నాయి.