ఇక సెలవ్‌…

And selav...– అధికారలాంఛనాలతో ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు
– పాడెమోసిన చంద్రబాబు
– అంతిమయాత్రలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు
నవతెలంగాణ- హైదరాబాద్‌ బ్యూరో
రామోజీ గ్రూపు సంస్థల చైర్మెన్‌ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీ స్వయంగా నిర్మాణం చేయించుకున్న స్మృతి కట్టడం వద్దే కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. రామోజీరావు చితికి ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ నిప్పంటించారు. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల ‘జోహార్‌ రామోజీరావు’ నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.
ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పోలీస్‌ బ్యాండ్‌ నడుమ రామోజీ అంతిమయాత్ర ప్రారంభమయింది. అక్కడ నుంచి రామోజీ గ్రూప్‌ సంస్థల కార్యాలయాల మీదుగా స్మారకకట్టడానికి చేరుకుంది. అభిమానుల నినాదాలతో ఫిల్మ్‌సిటీ మార్మోగింది. అంతిమయాత్ర స్మృతి కట్టడం వద్దకు చేరుకున్న తర్వాత ఆయన భౌతికకాయాన్ని కుటుంట సభ్యులు వాహనం నుంచి కిందకు దింపారు. కుటుంబ సంప్రదాయ క్రతువులు నిర్వహించిన అనంతరం చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, పలువురు సినీ ప్రముఖులు రామోజీకి కడసారిగా నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంత్యక్రియల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజరు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ప్రముఖ వైద్యులు గురవారెడ్డి, శాంతా బయోటెక్‌ వరప్రసాద్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వరరావు సినీ, రాజకీయప్రముఖులనేకులు పాల్గొన్నారు.

Spread the love