ఒడిశా రైలు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

నవతెలంగాణ – ఒడిశా
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడానని చెప్పారు. బాధితులను కేంద్రం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్ గురించి తెలిసి తీవ్ర ఆవేదన చెందానంటూ ఆయన ట్వీట్ చేశారు. రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. రైలు ప్రమాదంలో ఇంత మంది మరణించడం తన మనసును కలిచి వేసిందని ట్వీట్ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదం జరిగిందని తెలిశాక తీవ్ర ఆవేదనకు లోనయ్యాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి జాతీయ విపత్తు నిర్వహణ దళాలు (ఎన్డీఆర్‌ఎఫ్) చేరుకున్నాయని హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. బాధితులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటూ రాష్ట్ర సహాయక బృందాలు, ఎయిర్‌ఫోర్సు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలయిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని తెలిపారు.
ప్రజల సహాయార్థం అధికారులు ప్రకటించిన హెల్ప్‌లైన్ నెంబర్లు:
హౌరా హెల్ప్‌లైన్ నెంబర్ – 033 – 26382217
ఖరగ్‌పూర్- 8972073925, 9332392339
బాలాసోర్- 8249591559, 7978418322
షాలీమార్ – 9903370746

Spread the love