ఆయిల్ ఫామ్ తోటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

– జిల్లా ఉద్యాన వన అధికారి జి. అన్నపూర్ణ
నవతెలంగాణ – భువనగిరి
వేసవిలో ఆయిల్ పామ్ తోటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉద్యానవన అధికారి జి. అన్నపూర్ణ   శుక్రవారం ప్రకటనలో రైతులను కోరారు. జిల్లాలో సుమారు 750 మంది రైతులు 3600 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారని, ఈ తోటల పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చెట్లు వృద్ది చెందుతాయన్నారు.  వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రత్త ఉన్నందున నీటి విషయంలో యాజమాన్య పద్దతులు చేపట్టాలన్నారు.  ఒకటి నుండి 3 సంవత్సరాల వయస్సు గల తోటలలో మూడు అడుగుల దూరంలో జనుము, పచ్చి రొట్ట ఎరువు పంటగా నాటుకోవాలన్నారు. అందువలన చెట్టుకు చల్లదనంతో పాటు ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి మొక్కకు ఇరువైపులా 40 లీటర్ల డిస్చార్జ్ అయ్యే మైక్రో జెట్లు అమర్చుకోవాలని, వేసవిలో చిన్నమొక్కలకు రోజూ సుమారు వంద నుండి 150 లీటర్ల నీరు అందించాలన్నారు. మూడేళ్లలోపు వయస్సున ఆయిల్పామ్ మొక్కలలోని పువ్వు గుత్తులు ప్రతి నెలా రెండు సార్లు తొలగించాలన్నారు. రైతులకు అందించిన డైరీలలో సూచించిన విధంగా పోషకాలను తప్పనిసరిగా మొక్కలకు అందించాలని, నీరు తక్కువ అయినా గానీ ఎట్టి పరిస్థితిలో చెట్టు మరణించదన్నారు. తిరిగి నీరు అందిస్తే కొత్త ఆకులు వేసి చిగురిస్తుందని, కావున రైతులు ఈ వేసవిలో తమ తోటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆమె కోరారు.
Spread the love