సాగుచేసే ప్రతీ రైతుకి ఆయిల్ ఫాం రాయితీ మొక్కలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
సాగు భూమి ఉండి,నీటి వసతి ఉన్న ప్రతీ రైతుకు ఆయిల్ఫెడ్ రాయితీ పై ఆయిల్ ఫాం మొక్కలు అందజేస్తుంది అని రైతు సంఘం నాయకులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశానుసారం ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని ప్రతీ రైతుకి రాయితీ మొక్కలు అందించాలనే నిర్ణయం మేరకు రాయితీ మొక్కలు పంపిణీ ని శనివారం స్థానిక ఆయిల్ఫెడ్ డివిజన్ కార్యాలయం లోని కేంద్రీయ నర్సరీలో ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ బాలక్రిష్ణ ఆద్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా హాజరైన ఆయన రామచంద్ర ప్రసాద్ ఆయిల్ ఫాం సాగు లో అదనంగా అంతర్ పంటలు పండించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.ఈ సదావకాశాన్ని ప్రతీ ఒక్క రైతు సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధి సాధించాలని రైతుసంఘం నాయకులు జూపల్లి రమేష్ రైతులకు సూచించారు. అనంతరం బాలక్రిష్ణ మాట్లాడుతు సాగు భూమి ఉండి,దీనికి సంబంధించిన ఏదైనా దృవీకరణ పత్రం ఉండి ఆయిల్ ఫాం సాగు చేయాలనే రైతులు భూమికి చెందిన ఏదైనా ఆధార్ పత్రం,రైతు ఆధార్ కార్డు,బ్యాంక్ ఖాతా,రైతు అంగీకార పత్రం తో డివిజనల్ కార్యాలయంలో సంప్రదిస్తే క్షేత్రస్థాయి సిబ్బంది విచారించి మొక్కలు మంజూరి చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 253 మంది రైతులు,614 ఎకరాలకు,35 వేల మొక్కలు కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సరీ ఇంచార్జి మహేష్,ఏరియా ఇంచార్జి లు అప్పారావు,సతీష్,ఫణి కుమార్,శివాని లు పాల్గొన్నారు.

Spread the love