ప్రయివేటురంగంలో ఖమ్మంలో ఏర్పాటు
సీఎంతో భేటీ అయిన
గోద్రేజ్ ఇండస్ర్టీస్ ప్రతినిధులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ర్టంలో తొలిసారిగా ఆయిల్‌పామ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్(కార్పొరేట్ వ్యవహారాలు) రాకేష్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి తెలిపారు. బుధవారం వారు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌సీహెచ్చార్డీ)లోని బోధి పెవిలియన్‌లో సీఎం ఏ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గోద్రేజ్ ప్రతినిధులు తమ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపైన ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. రాష్ర్టంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో ప్రయి వేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ను త్వరలో ప్రారం భించనున్నట్టు తెలిపారు. దీనిపై పలు కీలక అంశాలపైన చర్చలు జరిపారు. ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టు బడితో ఏర్పాటువుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 700 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, నర్సరీ, పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం , సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమి ని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థకు రాష్ర్ట ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గోద్రేజ్ సంస్థ ప్రతినిధులు సీడ్ గార్డెన్ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని సీఎంను కోరారు. అలాగే ప్రాసెసింగ్ మిల్ కోసం రాహదారిని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని ఆదేశించారు.
మా దేశం రండి : సీఎం రేవంత్‌రెడ్డి బృందాన్ని ఆహ్వానించిన కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్
కెనడా-తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించేం దుకు తమ దేశం రావాలని సీఎం ఏ రేవంత్‌రెడ్డి బృందాన్ని కెనడా హైకమిషనర్ టు ఇండియా క్రిస్ కూటర్ ఆహ్వానించారు. బుధవారం నాడాయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు వ్యాపార అంశాలపై చర్చలు జరిపారు. సీఎం కూడా రాష్ర్టంలో కెనాడా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరారు. మౌలిక వసతుల ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ-కెనడా మధ్య పెరుగుతున్న పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, సీఐబీసీ హైదరాబాద్‌లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ హైదరాబాద్‌కు చెందిన సీటీఆర్ ఎల్ఎస్(CtrlS) డేటా సెంటర్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ కెనడియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడాన్ని సీఎం స్వాగతించారు. అలాగే తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సాధించిన పురోగతిని ఈ సందర్భంగా ఆయన క్రీస్ కూటర్ బృందానికి వివరించారు. ఫార్చ్యూన్-500 కంపెనీల గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. సౌర విద్యుత్ విస్తరణ, హరిత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై చర్చించారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ రెండో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పాల్గొనాలని కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఐటీ,ఈ అండ్ సీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో
గుట్ట పాలక మండలి భేటీ
యాదగిరి గుట్ట దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన నూతన పాలక మండలి చైర్మెన్, సభ్యులు… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో వారు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలక మండలికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బోర్డు చైర్మెన్ ఎం. సత్యనారాయణరెడ్డి, సభ్యులు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డా మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం. రాఘవేందర్‌రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులున్నారు.



