అర్వపల్లిలో కర్రలు, రాళ్లతో బాహాబాహీ
ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
పోలీసుల లాఠీచార్జి
గాంధీ భవన్‌కు చేరిన సెగలు
చిచ్చు పెట్టిన మండల అధ్యక్షుల నియామకాలు..
నవ తెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రగులుతున్న గ్రూపు పోరు బుధవారం బహిరంగ రణరంగంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ అనుకూల, వ్యతిరేక గ్రూపులు అర్వపల్లి మండల కేంద్రంలో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు గ్రూపులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు విధుల్లో ఉన్న పోలీసులకు కూడా గాయాలయ్యాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకాలతో మొదలైన విభేదాలు చివరకు వీధి పోరాటానికి దారి తీయగా, ఆ సెగలు హైదరాబాద్ గాంధీభవన్ వరకు చేరాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరుల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవల జరిగిన మండల అధ్యక్షుల నియామకాల్లో ఎమ్మెల్యే సామేల్ తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చి, పాత కాంగ్రెస్ నాయకులను పూర్తిగా పక్కన పెట్టారని వ్యతిరేక గ్రూపు వారు ఆరోపిస్తున్నారు. ఈ నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకులు దరూరి యోగనందాచార్యుల ఆధ్వర్యంలో బుధవారం నాయకులు, కార్యకర్తలు ‘చలో గాంధీభవన్’కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు అర్వపల్లి మండల కేంద్రంలో వారిని అడ్డుకోవడంతో మొదట వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికే పరిస్థితి అదుపు తప్పి ఇరు గ్రూపులు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగాయి. అర్వపల్లి జంక్షన్ ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించింది. రాళ్ల దాడితో పలు కార్లు, ఇతర వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరు గ్రూపులకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు భారీ బలగాలతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. దీంతో లాఠీచార్జి చేసి ఇరు గ్రూపులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అనంతరం మండల కేంద్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అయినా.. ఎమ్మెల్యే వ్యతిరేక గ్రూపు వెనక్కి తగ్గకుండా హైదరాబాద్ గాంధీభవన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే మందుల సామేల్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని, పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అవమానిస్తున్నారని పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదు చేసింది. మండల అధ్యక్షుల నియామకాలను వెంటనే రద్దు చేయడంతోపాటు ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇప్పటికే మండల అధ్యక్షుల నియామకాలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు.. ఏకాభిప్రాయం వచ్చే వరకు నియామకాలను నిలిపేయాలని కోరిన విషయం తెలిసిందే. దీంతో తుంగతుర్తిలోని ఆ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి చేరాయి. కాంగ్రెస్‌లో గ్రూపుల పోరు బహిరంగ ఘర్షణలకు దారి తీయడం, నాయకులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం, పోలీసుల లాఠీచార్జి వరకు పరిస్థితి వెళ్లడం పార్టీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో గ్రూపుల జగడం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



