మాదిగ కథలు

రచయిత ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ (1959 – 2022) హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. నల్లద్రాక్షపందిరి, వర్తమానం, కొత్త గబ్బిలం, గోసంగి, సాహితీసుధ తెలివెన్నెల, ప్రస్తుత ‘మల్లెమొగ్గల గొడుగు’ వీరి కవిత్వ వ్యాస కధా రచనలు. అనుభవం నుంచి పుట్టిన సాహిత్యం కనుక ఆర్ధ్రత ‘తడి’ కనిపిస్తుంది. మాదిగ ఉద్యమ స్ఫూర్తితో రాసిన ఆత్మగౌరవ కథలు. మాదిగ మూలాల్ని హైలైట్‌ చేస్తూ వారి సంస్కృతినీ వారి భాషని సొంతం చేసుకుని రాసిన కథలు.
వెలి వేయబడ్డ కులాలుగా చెప్పబడే మాల, మాదిగల జీవన వ్యవస్థ, వారి ఆచార్య వ్యవహారాలు, కట్టుబాట్లు, డప్పు, చెప్పులతో ఆ కులాలకున్న సంబంధం ప్రత్యేకతలని వివరిస్తాయి. ఈ కథలు ప్రకాశం జిల్లా, కనిగిరి మండంలోని రావిగుంట పల్లె చుట్టు పక్కల దళిత కుటుంబాలను ఈ 27 కథలు ఎత్తిచూపుతాయి. రచయిత వాడిన భాష, మాండలికపు మూస వల్ల తన తండ్రి అనుభవాలని తన అనుభవాలుగా మలిచి చెప్పిన వైనం ఎలెక్స్‌ హేలీ ‘రూట్స్‌’ లోని కథా, కధనం గుర్తుకు వస్తాయి. మాదిగ సంస్కృతికి మూల వస్తువులు డప్పు, చెప్పు. అడవి మీద ఆధారపడిన ఆహారం, చచ్చిన గొడ్డు మాంసం, చెప్పుల తయారీ వంటివి స్థానిక జీవనం పటం కట్టి వివరించారు. రచయిత తన దగ్గరి బంధువు సుందరమ్మ పెళ్లికి, రావిగుంటపల్లికి వెళ్లి తన దగ్గరి బంధువులతోని డప్పుగొట్టే పెదబోడి బావ చినబోడి బావలు కొడుకు దుబాయి పోయాడనుకుని రోజూ బస్టాండ్‌లో ఎదురు చూస్తే నాగ పెదయ్య, దావీదమ్మను కోటారెడ్డి బలాత్కారం చేయబోతోంటే ఆపిన ఆనందరావన్న గొడ్డలి, నవాబు గుర్రాన్నే నాట్యమాడించిన ముగ్గురన్నదమ్ములు, తాసుపాముని ధైర్యంగా ఎదుర్కొని చంపిన పెదబోడెమ్మ, సంగటి వండడం రాని శాంతమ్మను ఆమె మామ అయిదో తరగతి సదివి ఇందిరాగాంధీ అంత సాయం చేసిన సరోజినత్త, అంకమ్మ అలీసమ్మ మారమ్మ మేరమ్మ పిచ్చయ్య పీటరు, ఎంకయ్య యాకోబులుగా మతం పుచ్చుకుని మారిన వైనం… ఒక్కటనేమిటి, ఆ కమ్యూనిటీ అనుభవాలను అతి దగ్గరగా చూపించాడు రచయిత. బతుకుతోలు సెల్లదీయటం, అదరకుమ్మటం, పేరాలు దీయటం ఇడిసి బెట్టిన ఊరు మీద ఇడిసిబెట్టిన పేగు మీద ప్రేమ చూపటం, కులం, బలం బాలింత పత్తెం… లాంటి పదాల ప్రయోగం ఈ కథల్ని నేటివిటీకి దగ్గరగా తీసుకువెళ్తాయి. కథల్ని చెప్పిన తీరు రచయితను ఈ సంపుటాన్ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది.
జె.దేవిక మలయాళ రచయిత్రి అన్నట్లు ఈ పుస్తకాన్ని చదువుతుంటే దట్టమైన చీకటి రాత్రి వేళ ప్రకాశవంతమైన నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

– కూర చిదంబరం, 8639338675

Spread the love