అదానీకి పాతబస్తీ కరెంటు వసూళ్లు

అదానీకి పాతబస్తీ కరెంటు వసూళ్లు– డిస్కంల ప్రయివేటీకరణ షురూ
– దావోస్‌లో సీఎంతో అదానీ ఒప్పంద ఫలితం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌ పాతబస్తీలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ఫ్రాంచైజీ రూపంలో అదానీ గ్రూప్‌కు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. పాతబస్తీలో విద్యుత్‌ పంపిణీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయనీ, దాన్ని గాడినపెట్టేందుకు భూగర్భ లైన్లను వేస్తూ, 75 శాతం బిల్లు వసూళ్లను అదానీ కంపెనీకే అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. 2024 జనవరి 17న దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో అదానీ గ్రూప్‌ అధినేత గౌతం అదానీ, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ నాలుగు ఒప్పందాలు చేసుకుంది. దానిలో భాగంగానే పాతబస్తీలో విద్యుత్‌ పంపిణీ ఫ్రాంచైజీ తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఢిల్లీలో ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం. దీనిపై ఆ కంపెనీ ప్రతినిధులు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఫ్రాంచైజీ ప్రాజెక్ట్‌ వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. దీనిపై సమగ్ర ప్రణాళికతో రావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వారికి సూచించారని ప్రచారం జరుగుతోంది. డిస్కంలను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘకాలంగా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దావోస్‌ ఒప్పందంలో భాగంగా అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్స్‌ ఇటీవలే హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్‌ ఇండిస్టీస్‌ను కొనుగోలు చేసింది. దీని విస్తరణ కోసం రూ.1,400 కోట్లతో ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టేలా ఒప్పందం జరిగింది. మరోవైపు హైదరాబాద్‌ కేంద్రంగా రూ.5వేల కోట్లతో 100 మెగావాట్ల డేటా స్టోరేజ్‌ సెంటర్‌ నిర్మాణం కూడా కార్యరూపంలోకి వస్తున్నది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌) ద్వారా కోయ బెస్తగూడెంలో 850 మెగావాట్లు, నాచారంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నారు. పాతబస్తీలో కొత్తగా నిర్మించే అండర్‌గ్రౌండ్‌ కరెంటు లైన్లకు ఈ ప్రాజెక్టుల నుంచే విద్యుత్‌ సరఫరా చేస్తారని సమాచారం. దీనికోసం రూ.5వేల కోట్ల నిధుల్ని ఆ సంస్థ కేటాయించింది. ప్రస్తుతం పాతబస్తీలో విద్యుత్‌ నష్టాలు 40 శాతం నుంచి 37 శాతానికి తగ్గాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Spread the love