ఆరు కోట్ల ఓట్లపై వేటు
సీఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక
సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో తొలగింపు
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు ఏడాది పూర్తయింది. ఈ ప్రక్షాళనలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ భారీ తొలగింపులపై ప్రతిపక్షాలు, ఎన్నికల సంఘం మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో మూడో దశ ప్రక్షాళన కొనసాగుతోంది.
బీహార్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
గత ఏడాది జూన్ 24న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు పైలట్ ప్రాజెక్టుగా సర్ ప్రారంభమైంది. అక్కడ ఈ ప్రక్రియ ద్వారా ఏకంగా 65 లక్షల ఓట్లను తొలగించారు. అయితే, పత్రాలు లేవన్న నెపంతో, అధికార బీజేపీకి మేలు చేసేందుకే ఎన్నికల సంఘం ఈ చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కానీ, ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పుతో ఎన్నికల సంఘం చేపట్టిన ఈ రివిజన్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసింది. అయితే, ఈ ఓట్ల తొలగింపు ప్రభావం సంక్షేమ పథకాలపై కూడా పడుతోంది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ల డేటాను సామాజిక భద్రతతో అనుసంధానం చేయడంతో, ఓటు హక్కు కోల్పోయిన వారు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరమవుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ సర్ తెరపైకి తేవటం వెనుక.. ప్రతిపక్ష పార్టీలు, మైనారిటీ ఓట్లను తొలగించి తద్వారా ఆయా రాష్ట్రాల్లో గెలవటమే ఉద్దేశమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో సర్
ఈ భారీ ప్రక్షాళన కార్యక్రమం ప్రాముఖ్యతను గుర్తిస్తూ, దీనిని ఎన్సీఈఆర్టీ సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాల్లో కూడా చేర్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హులను తొలగించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని అందులో వివరించారు. ఇక గత ఏడాది అక్టోబరు 27న ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్, తమిళనాడు సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో దశ ప్రారంభమైంది. దీని ద్వారా ఈ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను ఏకంగా 10.2 శాతం మేర కుదించారు. ప్రక్షాళనకు ముందు 50.99 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య 45.81 కోట్లకు పడిపోయింది. అంటే 5.18 కోట్లకు పైగా పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన 66,88,000 మంది పేర్లను జాబితా నుంచి తీసేశారు. అత్యధికంగా యూపీలో 25.47 లక్షలు, బెం గాల్‌లో 24.16 లక్షల మంది చనిపోయిన వారి ఓట్లను తొలగించారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత మరో 63.16 లక్షల పేర్లను డిలీట్ చేశారు. ప్రస్తుతం (సర్) ప్రక్రియ మూడో దశకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 14న మూడో దశ సవరణ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏకంగా 36.73 కోట్ల మంది ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ మూడో దశ సవరణ ప్రక్రియ పూర్తిగా ముగియనుంది.



