ఆ 300 మందికి మాత్రమే జాప్యం

– స్టాఫ్‌ నర్సులకు జీతాల చెల్లింపు పై మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో నూతనంగా నియమితులైన స్టాఫ్‌ నర్సుల్లో 300 మందికి సాంకేతిక సమస్య కారణంగా జీతాల చెల్లింపులో జాప్యం చోటు చేసుకుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 స్టాఫ్‌ నర్సుల పోస్టులను భర్తీ చేసినట్టు తెలిపారు. వీరంతా వైద్యారోగ్యశాఖతో పాటు మరో ఆరు శాఖల్లో తమ సేవలను అందిస్తున్నట్టు చెప్పారు. ఆస్పత్రులతో పాటు షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు,
వెనకబడిన తరగతులు, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వికలాంగుల వసతి గృహాలతో పాటు ప్రజలకు అత్యవసర సేవలందిస్తున్నారని వివరించారు. వీరందరికి సకాలంలో జీతాలు చెల్లిస్తున్నట్టు స్పష్టం చేశారు. 300 మందికి సంబంధించిన పర్మనెంట్‌ రిటైర్‌ మెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (పీఆర్‌ఏఎన్‌) జనరేట్‌ చేయడంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారు బ్యాంకు నుంచి జీతం పొందలేకపోయారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని భరోసానిచ్చారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇస్తున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

Spread the love