ఊల్లెది ఊల్లె వియ్యం అందుకుంటే పెద్ద మజా రాదు. వేరే ఊర్లె వియ్యంపుని దగ్గరికి పోయి రావడం, అక్కడ అరుసుకోవడం ఒక అనుభూతి. దీనికి ఒక సామెత వున్నది. ‘ఊర్లె వియ్యం నిత్తె కయ్యం’ అని. ఉన్న ఊరిలోనే బిడ్డను ఇస్తే అల్లుడో, అత్తనో ఏదన్న అంటే లొల్లి. ఊరు కాబట్టి కనపడతరు. అందుకే కయ్యం అంటరు. ‘ఊల్లె చుట్టరికం ఊరు పక్క చేనూ పనికి రావు’ అని కూడా అంటరు. ఊల్లె చుట్టరికం లెక్కనే ఊరి పక్కనే మక్కజొన్న చేను వున్నదనుకో, ఎవలు అడుగుతే వాల్లకు ఇయ్యాలె. వంకాయలు, టమాటలు, ఏది పండినా పక్కనే వుంటరు. కాబట్టి ఇచ్చుకం వుంటది. అట్లనే ‘ఊరి దగ్గరి చేనుకు అందరూ దొంగలే’ అనే సామెత కూడా పుట్టింది. పక్కనే చేను వుంటే ఆ వ్యవసాయదారుడు కూడా ఆ సమయంలో అక్కడే వుంటే అడిగి తెచ్చుకుంటరు. లేకుంటే దొంగతనం చేస్తరు. అందుకే ఆ సామెత పుట్టింది. ఎంత చిన్న చేను, చెల్క అయినా అందరు అడిగినంక ఎంతకని ఇస్తం. అప్పుడు ‘ఊర విష్కమీద తాటికాయ పడ్డట్టు’ అయితది కత. ఇదంత చెప్పుతాంటే ఎవరో ‘ఊరికి అమాస లేదన్నడట’ అన్నట్టున్నది అంటరు. అంటే అన్ని ఊర్లకు అమావాస్య, పౌర్ణమి వుంటయి గని లేవనే వ్యంగ్యంలో వాడుతరు. ఊల్లల్ల కొందరిని చూస్తే భల్లే గమ్మత్తిగా వుంటరు. వాల్లను ‘ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు’ అన్న లెక్క వుంటరు. ఊల్లనే కాదు ‘మాటమాటకు తప్పు తీసేవాల్లు’ అంతటా వుంటరు. వీల్లే మల్లా ‘కిందపడ్డా నేనే మీద పడ్డా నేనే గెలుపు’ అంటూ విజయ చిహ్నం చూపిస్తరు. కొందరైతే ‘నిమ్మకు నీరెత్తినట్టు’ వుంటరు. వాల్లు ‘ఊరు మీద ఊరు పడ్డా కదలరు మెదలరు’. ఏ పట్టింపు లేనోల్లు అని అర్ధం.
– అన్నవరం దేవేందర్, 9440763479