ఓరుగల్లు బాలల కథల హరివిల్లు

Orugallu is the rainbow of children's storiesకాకతీయుల కార్యక్షేత్రం ఓరుగల్లు ప్రాంతం నుండి పొట్లపల్లి రామారావు వంటి తొలి తరం తెలంగాణ బాల సాహిత్య సృజనకారులు మనకు కనిపిస్తారు. తరువాత తొంభయ్యవ దశకం తరువాత ఎక్కువ మంది బాల సాహితీవేత్తలు కనిపిస్తారు. అంపశయ్య నవీన్‌ వంటి గొప్ప రచయితలు తొలుత బాల సాహిత్యం రాశారు. ఈ ప్రాంతపు బాల సాహిత్యకారుల్లో మనకు కనిపించే వారిలో హనుమకొండ బాలల కథల కొండ శ్రీ ప్రతాపురం రామానుజాచారి ఒకరు. ఏప్రిల్‌ 4, 1959న వరంగల్‌ జిల్లా హనుమకొండలో పుట్టారు ప్రతాపురం. వీరి తల్లిదండ్రులు శ్రీమతి ప్రతాపురం మంగతాయారు, శ్రీ పెరుమాండ్లాచారి. టీచర్‌గా నియామకమై విద్యాశాఖలో వివిధ స్థాయిల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన రామానుజాచారి బాల సాహితీవేత్త, కథా రచయితగా ప్రసిద్ధులు. 1979 నుండి 2017 వరకు ఉపాధ్యాయులుగా పనిచేశారు.
‘నూనూగు మీసాల నూత్న యవ్వనం’ లో రచనా రంగంలోకి అడుగుపెట్టిన వీరు పిల్లల కోసం నాలుగు వందలకు పైగా కథలు రాసారు. బాలల కథలే కాక యాభై వరకు కథానికలు రాశారు. ఇవన్నీ ఆకాశవాణి కొత్తగూడెం ద్వారా ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం పిల్లల కోసం ‘మొలక’లో బాలల రామాయణం రాస్తున్న ప్రతాపురం తొలుత అనేక పురాణ కథలు, గాథలను రాశారు. బాల సాహిత్యంలోనే కాక ఆధ్యాత్మిక సాహిత్య సృజనలోనూ వీరిది అందెవేసిన చేయి. నిరంతరం ఉత్సాహంగా ఉండే వీరు లెక్కలేన్ననన్ని మార్లు అన్నదానాలు మొదలు పలు సేవా కార్యక్రమాలు చేశారు. బాల సాహిత్య కార్యక్రమాలు, రచనలే కాకా వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు కూడా! జెమిని టివి వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచారు. జి.టి.వి 1993 సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన నెల రోజుల పోటీల్లో పాల్గొని వరుసగా అయిదు బంగారు ఉంగరాలు గెలుచుకున్న ఉంగరాల బంగారు చారి వీరు. బాల సాహిత్య పరిషత్‌ పురస్కారం మొదలు వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారం వరకు వివిధ పురస్కారాలు, సత్కారాలు వీరి ఖాతాలో ఉన్నాయి. ప్రతాపురం రామానుజాచారి బాలల కథలు చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, చిట్టి వికటన్‌, బొమ్మరిల్లు మొదలుకుని దాదాపు అన్ని పిల్లల పత్రికల్లో వచ్చాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రభలో వీరి కథలు ప్రచురణ కావడం విశేషం. ‘తల్లి దీవెన’, ‘విషకన్య’, ‘అపూర్వ సహౌదరులు’, ‘అమృత జలం’ వీరి బాలల నవలలు. బాలమిత్రలో ఇతర రచయితలతో కలిసి ఒక గొలుసుకట్టు నవల కూడా రాశారు ప్రతాపురం. తన కథలన్నీ ‘చిరు మువ్వలు’ శీర్షికన ఇరవై భాగాలుగా తేవాలన్నది ఈ ‘బాలల కథల బంగారుచారి’ ఆలోచన. అందులో భాగంగా ‘చిరు మువ్వలు 1Ê2’ అచ్చులోకి వచ్చాయి. ఇతర భాగాలు ఇంకా రావాలి.
పురాణ పాత్రలు, సంఘటనలు తీసుకుని చక్కని కథలు రాయడం వీరికి తెలిసిన విద్య, అటువంటిదే ‘అన్నదాన మహిమ’. స్వర్గారోహన సమయంలో ధర్మరాజు నరకంలో ఉన్న కర్ణున్ని చూసి దేవదూలతను ‘కర్ణుడు మహాధాత కదా, నరకానికి ఎందుకు వెళ్ళాడు’ అని అడగగా, ‘లేదనకుండా అన్నీ దానం చేశాడు, కానీ అన్నదానం చేయలేద’ని సమాధానం దేవదూతలతో చెప్పిస్తాడు రచయిత. తనకు అన్నదానమంటే యిష్టం, దానిని ఇలా పౌరాణిక పాత్రలతోనూ చెప్పించే నేర్పు వీరి కథల్లోచూడొచ్చు. మలితరం బాలల కథకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. మనకు తెలిసిన దానినే ఎలా పిల్లల కోసం అందంగా చెప్పొచ్చో కూడా వీరి రచనల్లో చూడొచ్చు. అటువంటిదే ‘కనువిప్పు’ కథ. పోతన, శ్రీనాథులకు సంబంధించిన కల్పిత కథల్లో ఒకటి.
దేశకాల పాత్రోచితమైనప్పుడే ఏ సాహిత్యమైనా నిలుస్తుంది. తెలంగాణ వెలుగులు ‘సమ్మక్క-సారలమ్మ’ లను బాలల కోసం రాసిన ఘనత ప్రతాపురంది. ఇందులో వీర నారీమణులు సమ్మక్క-సారలమ్మ వీరత్వాన్ని, మాలిక్‌ కాపూర్‌ను వాళ్ళు ఎదురించి పోరాడి వీరమరణం పొందిన విధానాన్ని బాలల స్థాయికి ఎదిగి, ఒదిగి రాశారు రచయిత. అంతేకాక మేడారం జాతర గురించి చెబుతూ, ‘చూసి తరించాల్సిందే’ అంటారాయన. కంప్యూటర్లు, ఫేస్‌బుక్‌లు, అంతర్జాలాల కాలంలో నేటి తరం ఇంకా రంగాపురాలు, అడవుల్లోనే ఉంటే అయిదు దశాబ్దాలుగా రాస్తున్న ప్రతాపురం ఎన్నో కొత్త పోకడలు తన కథల్లో చొప్పించడం విశేషం. అటువంటివి ‘వృత్తి-ప్రవృత్తి’, ‘గురు దక్షణ’ వంటివి వీరి ‘చిరు మువ్వలు-2’ లో చూడొచ్చు. పురాణాలు, ఇతిహాసాలు, మహావీరులు, జాతి నేతల కథలు వీరికి కరతలామలకాలు. వాటిని పిల్లల కోసం రాయడమే కాక, రేపటి పౌరుల్లో మహోన్నత విలువలు, భావాలు నింపడానికి తోడ్పడుతున్న మన ‘ఓరుగల్లు కథల హరివిల్లు ప్రతాపురం రామనుజాచారి’ గారికి జయహో!

– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love