‘ఘనమైన మన తెలంగాణా’ ఆదిరాజు వీరభద్రరావు అక్షర సంపద

'ఘనమైన మన తెలంగాణా' ఆదిరాజు వీరభద్రరావు అక్షర సంపద”ఇట్టి ఔన్నత్య సంపదల కిక్కయైన
మన తెలంగాణా భూమితో నేదిసాటి
కనుక భయమేల సోదరా కంఠమెత్తి
గానమోనరింపరా మన తెలంగాణ ఘనత”.
అని తెలంగాణా ఘనతను గురించి వేనోళ్ళ కీర్తించిన ఎందరో కవుల గుండెల్లో నిలిచిన మన తెలంగాణ ఔన్నత్యాన్ని గురించి పలు వ్యాసములను, గ్రంథాలను రచించిన మహా రచయిత ఆదిరాజు వీరభద్రరావు.
క్రీ.శ 1890 నవంబరు 16న నాటి ఖమ్మం మెట్టు జిల్లాలోని మధిర తాలూక దెందుకూరులో జన్మించిన ఆదిరాజు వీరభద్రరావు తమ 13వ యేట నుండే సాహిత్య రంగంలోకి పాదం మోపారు. నాటి ప్రభుత్వపు దమన నీతిని ఎదురించే పోరాటంలోను, భారతీయ స్వాతంత్య్ర పోరాటంలోను, భాగ స్వాములుగా ఉంటూనే అకుంఠితమైన దీక్షతో సాహిత్య సేవ చేయడంతో పాటు తెలంగాణ చరిత్రను వెలికి తీసి వ్యాసాల రూపంలోను, గ్రంథాల రూపంలోను అందించిన ప్రతిభాశీలి ఆదిరాజు వీరభద్రరావు.
ఆదిరాజు వీరభద్రరావు అక్షర వ్యవసాయం బహు ముఖీనంగా విస్తరించి వందలాది రచనలకు కారణమైంది. సుమారు 25 గ్రంథ రచనలు చేసిన ఆదిరాజువారి రచనల్లో దాదాపు మూడు వంతుల రచనలు తెలంగాణాకు సంబంధిం చినవే. ”మన తెలంగాణం”, ”ప్రాచీనాంధ్ర నగరములు”, ”షితాబుఖాను”, ”తెలంగాణా శాసనములు” వంటి గ్రంథాలు తెలంగాణాలోని ఎన్నో విశేషాలను ప్రపంచానికి అనేక ప్రమా ణాలతో అందించిన గ్రంథములని చెప్పవచ్చు. సమకాలీన సాహిత్యంలో తమ జన్మభూమియైన తెలంగాణా చరిత్రను సమగ్రంగా అందించే ప్రయత్నంలో వారు రచించిన రచనలను ఒక విధంగా తెలంగాణా సమాచార దర్శనములని భావిచవచ్చు. ”మన తెలంగాణము”లో పొందుపరచిన పది వ్యాసాలు కూడా తెలంగాణలో లభించిన శాసనాల ఆధారంగా, ఇక్కడి చరిత్రను అక్షరబద్ధం చేసినవే. ఈ నేలను ఏలిన కాకతీయులను గురించి ఈ ప్రాంతపు తవ్వకాలలో లభించిన కెయిరనుల (సమాధులు) ను గురించి, ఈ ప్రాంతమునందు లభించిన ప్రాచీన తాళపత్రాల గురించి, ఇక్కడి తవ్వకాలలో లభించిన నాణేల చరిత్రను గురించి పలు కోణాలలో పరిశోధించి ఈ ప్రాంతపు ప్రాచీన చరిత్రను మన కండ్ల ముందుంచారు వీరభద్రరావు. అదే విధంగా ప్రాచీనాంధ్ర నగరాల గురించి రచించిన ప్రత్యేక గ్రంథమందలి 9 నగరాలు నేటి తెలంగాణములోనివేయైనను నాటి నిజాం రాష్ట్ర భాగములోని మరి రెండు నగరముల గురించి కూడా లోతైన పరిశోధన చేసి ఆయా నగరాల పుట్టు పూర్వోత్తరాలను, అక్కడి నిర్మాణ విశేషాలను, పరిపాలించిన రాజ వంశాలను పేర్కొని ఆయా నగరాల ప్రత్యేకతలను వాటి ఉన్నతిని స్పష్టంగా తెలియ చేసినారు. అంతేకాక ఓరుగల్లు సర్దారైన ”షితాబుఖాను” అను సీతాపతిరాజు చరిత్ర ఎన్నో శాసన ప్రమాణాలతో రచించిన ఉత్తమ గ్రంథం. తెలంగాణంలో లభించిన పలు రాజ వంశములకు చెందిన శాసనములను పరిష్కరించి ”లక్ష్మణరాయ పరిశోధక మండలి” వారు ప్రచురించిన సంపుటాలలో మొదటి సంపుటానికి సంపాదకత్వ బాధ్యతలు వహించి తీర్చిదిద్దిన ప్రామాణిక పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు.
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం, విజ్ఞాన సర్వస్వం వంటి గ్రంథాలతో పాటు నాటి పత్రికలలో, రేడియో ఉపన్యాసాల ద్వారా ఆదిరాజు వారు రచించిన సుమారు రెండు వందలకు పైబడిన వ్యాసాలలో దాదాపు 150 వ్యాసాలకు పైబడిన వ్యాసాలన్నీ తెలంగాణమునకు సంబంధించినవే. ఇక్కడ తవ్వకాలు జరిపినపుడు లభించిన ఆధారాలతో చరిత్రను నిర్ధారించెడి వ్యాసాలు కొన్ని, ఇక్కడి జిల్లాల విశేషాలను గురించి. ఈ ప్రాంతపు జనుల జీవన విధానాలను గురించి, ఇక్కడి శాసనాలను గురించి సమగ్రమైన సమాచారంతో ఈ వ్యాసాలు రచించబడ్డాయి. వీటితో పాటు ప్రవహించే నదులకు సంబంధించిన వివరాలు, ఊర్లపేర్లను గురించిన వివరాలు, ఈ ప్రాంతము నందలి దేవాలయ నిర్మాణాలను గురించి, శిల్పకళా నైపుణ్యాలను గురించి ఈ నేలలో జన్మించిన ప్రతిభామూర్తులైన వ్యక్తులను గురించి, ఇక్కడ విస్తరించిన బౌద్ధ, జైన, వైష్ణవాది మతాల వివరాలను గురించి సమగ్రమైన విషయసేకరణ చేసి వ్యాసాలను సుసంపన్నం చేసినారు.
తెలంగాణమందు నూత్న చైతన్య ప్రసారము చేసిన అనేక సంస్థలతో ఆదిరాజు వీరభద్రరావుకు సన్నిహితమైన సంబంధం ఉన్నది. ముఖ్యంగా శ్రీకష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, విజ్ఞాన చంద్రిక గ్రంథమాల, ఆంధ్రజనసంఘం, ఆంధ్ర పరిశోధక మండలి, విజ్ఞాన వర్ధిని పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలలో ఒక కార్యకర్తగా, గ్రంథపాలనా నిర్వహణాధికారిగా, స్థానిక చరిత్ర అన్వేషకుడిగా గ్రంథ ప్రచురణ విభాగ నిర్వహణా బాధ్యునిగా తమ అపురూపమైన సేవలను అందించి తెలంగాణ ఘనతను తెలియచేయుటలో ఆదిరాజు వారు కతకత్తులైనారు. జాతీయ చైతన్యముతో ఈ ప్రాంతమునకు కొత్త ఊపిర్లు పోసిన మహనీయులైన కొమర్రాజు లక్ష్మణ రావు, రావిచెట్టు రంగారావు, నాయని వెంకట రంగారావు, మాడపాటి హనుమంతరావు వంటి ప్రముఖులైన తెలంగాణా వైతాళికుల మార్గదర్శనంలో వారితో పాటు ముందడుగు వేసి పురోగమించిన వీరభద్రరావు సేవలు చిరస్మరణీయాలు.
స్త్రీ విద్యా వ్యాప్తిని గురించి పలువిధాల పాట్లు పడిన మహనీయుడైన మాడపాటి హనుమంతరావు గారితో స్థాపించిన పాఠశాలకు వారికి తోడ్పడిన సంఘ సంస్కర్త ఆదిరాజు వీరభద్రరావు. స్వాతంత్య్రానంతరం కూడా వారి కషి ఏ మాత్రము సన్నగిల్లక నిరంతర సాహితీ చైతన్యంతో కొనసాగింది. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం వంటి సర్వ సమగ్ర సమాచార గ్రంథములలో తెలంగాణాకు సంబంధించిన ప్రాంతాల చరిత్రలను వ్యాస రూపంలో రచించి తమ జీవితాన్ని సార్థక పరచుకున్నారు. తాము పుట్టిన నేలకు ఈ విధమైన అక్షర సేవచేసి, తమ జీవితాన్ని పవిత్రీకరించుకొని ఆదిరాజు వారు సంపూర్ణ జీవితాన్ని గడిపి 83వ ఏట 1973 సెప్టెంబరు 28న తమ భౌతిక జీవితాన్ని ముగించారు. వత్తి రీత్యా ఉపాధ్యాయునిగా తమ సేవలను చిన్ననాటి నుండే ప్రారంభించిన ఆదిరాజు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆదర్శ విద్యాబోధకునిగా కీర్తిగాంచి కొత్త తరాలకు విశేషజ్ఞానాన్ని అందించినాడు. ఉద్యోగవిరమణానంతరం కూడా సుమారు నాలుగు దశాబ్దాల పాటు తమ శాయశక్తుల కషి చేసి తెలంగాణా ఘనతను చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా అనేక రచనలు చేసి అజరామరకీర్తిమూర్తిగా చిరస్మరణీయులైనారు.

(నవంబర్‌ 16 ఆదిరాజు వీరభద్రరావు జయంతి సందర్భంగా)
– వి. గార్గేయి

Spread the love