ఆక్సిజన్‌.. అంబులెన్స్‌ లేక ఆగిన ఊపిరి

ఆక్సిజన్‌.. అంబులెన్స్‌ లేక ఆగిన ఊపిరి– సమయానికి చికిత్స అందక నవజాత శిశువు మృతి
– ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘటన
నవతెలంగాణ-ఉప్పల్‌
సమయానికి ఆక్సిజన్‌.. అంబులెన్స్‌ ఉండి ఉంటే ఆ పసిగుడ్డు ప్రాణం నిలిచేది.. కానీ పీహెచ్‌సీలో కనీసం ఆక్సిజన్‌ లేకపోవడం.. అంబులెన్సూ లేక ఆటోలో మరో ఆస్పత్రికి వెళ్లాల్సి రావడంతో జరగాల్సిన తీవ్ర నష్టం జరిగిపోయింది. నవజాత శిశువు ప్రాణం కోల్పోయింది. ఇది ఆ తల్లిదండ్రులను తీవ్ర వేదనకు గురిచేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ చిల్కానగర్‌ ప్రాంతానికి చెందిన మమతకు పురిటి నొప్పులు రావడంతో శనివారం తెల్లవారుజామున ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. నాలుగు గంటల సమయంలో ఆమెకు ప్రసవం జరిగి ఆడబిడ్డ పుట్టింది. అయితే, అరగంట తర్వాత పసికందు ఏడవడం లేదని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని స్టాఫ్‌నర్స్‌ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే పీహెచ్‌సీలో ప్రస్తుతం అంబులెన్స్‌, ఆక్సిజన్‌ లేదని చెప్పారు. దాంతో కుటుంబసభ్యులు పసికందును ఆటోలో నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. మిమ్మల్ని ఇలా ఎవరు పంపారు..? ఆక్సిజన్‌ పెట్టుకొని అంబులెన్స్‌లో తీసుకురావాలని తెలియదా అని డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబసభ్యులు పసికందు మృతదేహంతో ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి కొద్దిసేపు ఆందోళన చేశారు.

Spread the love