కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి పెయింటర్ బలి

– ప్రమాదవశాత్తు పంప్ హౌస్ లో పెయింటింగ్ కార్మికుడి మృతి
– కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు
– సేఫ్టీ మెటీరియల్ ఇవ్వని వైనం
నవతెలంగాణ కొనరావుపేట:
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక యువకుడు ప్రాణం బలితిసింది. రెండు రోజుల్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన తొమ్మిదవ ప్యాకేజిలో నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్ పంప్ హౌస్ కు పెయింటింగ్ వేస్తున్న హైదరాబాద్ సైదాబాద్ కు చెందిన కుమ్మగిరి శ్రీనివాస్ (29) అనే యువకుడు శనివారం ఉదయం ప్రమాదవశాస్తు కింద పడి మృతి చెందాడు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ను మరో మూడు రోజుల్లో ప్రకటించనున్న క్రమంలో ప్రభుత్వం మల్కపేట రిజర్వాయర్ ను రెండు రోజుల్లోనే ప్రారంభించాలని ప్రకటించింది. ఈక్రమంలో తొందరగా పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సరియైన సేఫ్టీ మెటీరియల్ ఇవ్వకుండా కార్మికులతో పెయింటింగ్ పనులు చేయిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. అందువల్లనే యువకుడి ప్రాణం పోయిందని జిల్లావ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. మృతుడికి భార్య రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నట్టు సమాచారం. కూలి పనికి వెళ్లి తిరిగి వస్తాడు అనుకున్న శ్రీనివాస్ కానరాని లోకానికి వెళ్లడం ఆ కుటుంబంలో విషాదాన్ని నెలకొల్పింది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Spread the love