– ఎంపీడీవోకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామ పంచాయతీ కార్మికులను ఎన్నికల హామీ మేరకు పర్మినెంట్ చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీవో రవీందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ‘మల్టీపర్పస్’ పేరుతో గ్రామ పంచాయతీ కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీ కార్మికులకు నెలనెలా వేతనాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులను అరికట్టాలని, జీవో నంబర్ 51ను సవరించాలని కోరారు. అర్హులైన కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు రెండో పీఆర్సీని వర్తింపజేయాలని అన్నారు. ఆదివారాలు, పండుగ రోజుల్లో సెలవులు ఇవ్వడంతోపాటు రెండు జతల దుస్తులు, చెప్పులు, కొబ్బరి నూనె అందించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, విజయలక్ష్మి, భవాని, మల్లేశ్వరి, యశోద, పద్మ తదితరులు పాల్గొన్నారు.



