– ప్రారంభించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజన యువతకు వృత్తి నైపుణ్యాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే లక్ష్యంతో రామన్నగూడెం గ్రామపంచాయతీలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గిరిజన సంక్షేమ శాఖ–తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఐటీడీఏ–భద్రాచలం పరిధిలోని యువజన శిక్షణ కేంద్రం–అశ్వారావుపేట ఆధ్వర్యంలో రామన్నగూడెం ఆఫ్ క్యాంపస్‌లో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 30 వరకు శిక్షణ కొనసాగనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ గిరిజన యువతకు విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు అందించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంచవచ్చన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందే దిశగా యువత ముందుకు సాగాలని సూచించారు. టైలరింగ్ వంటి వృత్తి ఆధారిత శిక్షణలు గ్రామీణ, గిరిజన ప్రాంతాల యువతకు ఆదాయ మార్గాలను కల్పించడంలో దోహదపడతాయని తెలిపారు.
రామన్నగూడెంలోనే ఆఫ్ క్యాంపస్ శిక్షణ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక యువత దూర ప్రాంతాలకు వెళ్లకుండానే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించిందన్నారు. శిక్షణ అనంతరం సొంతంగా టైలరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
టైలరింగ్ శిక్షణ మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచే కుట్టుపనులు నిర్వహించుకుంటూ కుటుంబ బాధ్యతలతో పాటు ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణార్థులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయిలో నైపుణ్యం సాధించాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టి స్వయం ఉపాధి సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.



