– కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్‌కు నామినేట్
మాడ్రిడ్ (స్పెయిన్) : భారత వికెట్‌కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక లారెస్ పురస్కారం రేసులో నిలిచాడు. లారెస్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుకు రిషబ్ పంత్ నామినేట్ అయ్యాడు. 2022 డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్ర గాయాలకు గురయ్యాడు. పలు శస్త్రచికిత్సలు, సుదీర్ఘ రిహాబిలిటేషన్ తర్వాత 2024లో రిషబ్ పంత్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. పునరాగమనంలో బంగ్లాదేశ్‌పై టెస్టు సెంచరీ సాధించిన రిషబ్ పంత్.. ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2025 ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో రికార్డు స్థాయిలో రూ.27 కోట్ల ధర దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ‘నా పని అయిపోయిందని అనుకున్నా. పునరాగమనం పూర్తిగా శారీరక, మానసిక సంఘర్షణ. నా నమ్మకం, కఠిన శ్రమకు దక్కిన విజయమే ఈ అవార్డుకు నామినేట్ కావటం’ అని పంత్ అన్నాడు. లారెస్ అకాడమీలోని 69 స్పోర్ట్స్ లెజెండ్స్ ఓటు ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఈ నెల 21న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డు వేడుక జరుగనుంది.