• మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్
నవతెలంగాణ -పెద్దవంగర
ఈ నెల 23 నా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించనున్న పేరెంట్స్ మీటింగ్ ను విజయవంతం చేయాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో అకాడమిక్ రివ్యూ, ముందస్తు బడిబాట కార్యక్రమంపై తో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. త్వరలో నిర్వహించనున్న ముందస్తు బడిబాట కార్యక్రమంలో అందరూ భాగస్వాములై, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు సంబంధించిన అన్ని రిపోర్టులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం చివరి రోజున పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందించాలని సూచించారు.
ప్రభుత్వం ఈ ఏడాది నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తో పాటుగా అల్పాహారం కూడా అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శేషవల్లి, సత్యనారాయణ, భీమ, తిరుపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, యాకయ్య, సతీష్, దేవదాస్, సీఆర్పీ వేముల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



