Tuesday, July 28, 2026
E-PAPER
Homeజాతీయంద‌ద్ద‌రిల్లిన పార్ల‌మెంట్‌

ద‌ద్ద‌రిల్లిన పార్ల‌మెంట్‌

- Advertisement -

ఢిల్లీలో ​విద్యార్థుల‌పై క్రూర‌త్వాన్ని నిర‌సిస్తూ ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌
పేపర్‌ ‌లీకేజీ నిరోధక బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి జితేంద్ర
ఉభయసభలు నేటికి వాయిదా
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

నీట్ పేప‌ర్ లీక్‌, విద్యావ్యవస్థలో వైఫల్యాలకు వ్య‌తిరేకంగా విద్యార్థులు, యువ‌త చేప‌ట్టిన పార్ల‌మెంట్ మార్చ్ లో పోలీసుల క్రూర‌త్వాన్ని నిరసిస్తూ ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న బాట ప‌ట్టాయి. దీంతో పార్లమెంట్‌ ‌దద్దరిల్లింది. ఉభయసభలు వాయిదాల ప‌ర్వం తొక్కాయి. సోమవారం లోక్‌స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా ప్రారంభించారు. వెంట‌నే ప్ర‌శ్నోత్త‌రాల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నించగా ప్ర‌తిప‌క్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. నీట్ అంశం, విద్యార్థుల పట్ల పోలీసుల చర్యపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ప్రతిపక్ష ఎంపీలు తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లి, చర్చల్లో పాల్గొని క్రమశిక్షణ పాటించాలని స్పీకర్ కోరారు. ‘‘ నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. సభ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే గౌరవనీయ సభ్యులపై చర్య తీసుకోవలసి ఉంటుంది’’ అని హెచ్చ‌రించా రు. అయినా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వెన‌క్కి త‌గ్గ‌కపోగా త‌మ ఆందోళ‌నను కొన‌సాగించా రు. దీంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న మ‌ధ్యే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేప‌ర్ లీకేజీ నిరోధ‌క బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం స‌భ‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగింది. దీంతో స‌భ‌ను సాయంత్రం ఐదు గంట‌ల‌కు వాయిదా వేస్తూ.. స్పీక‌ర్ ఓం బిర్లా పేప‌ర్ లీకేజీ నిరోధ‌క బిల్లుపై చ‌ర్చ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌కటించారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగ‌డంతో స‌భ‌ను నేటి (మంగ‌ళ‌వారం) కి వాయిదా వేశారు.

మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లోనూ అదే ప‌రిస్థితి నెల‌కొంది. రాజ్య‌స‌భ‌ను చైర్మెన్‌ ‌సీపీ రాధాకృష్ణ‌న్ ప్రారంభించి కార్యక‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌య‌త్నించారు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష‌నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే మాట్లాడుతూ విద్యార్థులపై పోలీసుల చర్య అత్యంత అసాధారణమైనదని, రాజ్యసభ కార్యవిధాన నియమావళిలోని రూల్ 267 ప్రకారం దీనిపై చర్చ జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. నిరసనకారులపై జరిగిన హింసకు హోం మంత్రి అమిత్ షానే కారణమని ఆయన పేర్కొన్నారు. దీంతో అధికార పార్టీ స‌భ్యులు కేక‌లు వేయ‌డంతో స‌భ‌లో ఒక్క‌సారిగా గంద‌ర‌గోళం నెల‌కొంది. వెంట‌నే చైర్మెన్‌ ‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభలో ఈ విషయాన్ని లేవనెత్తిన ఖర్గే దీనిపై తక్షణమే చర్చ జరపాలని కోరుతూ తాను రూల్ 267 కింద నోటీసు ఇచ్చానని తెలిపారు. దీనికి, రాజ్యసభ చైర్మెన్‌ ‌సీపీ రాధాకృష్ణన్, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని చేపట్టలేమని, ఈ అంశంపై గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఈ విషయం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని ఖర్గే నొక్కి చెప్పారు. దేశ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదని వాదిస్తూ, ఈ విషయంపై సభలో తక్షణమే చర్చ జరగాలని అన్నారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగింది. దీంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లోనూ అదే ప‌రిస్థితి కొనసాగింది. ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న మ‌ధ్యే వందేమాత‌రం గేయానికి సంబంధించిన బిల్లుపై కేంద్ర హోం స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చ‌ర్చ‌కు పెట్టారు. ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌నతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు వాయిదా వేశారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లోనూ అదే సీన్‌ ‌కనిపించడంతో స‌భ‌ను సాయంత్రం 5.15 గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ఆందోళ‌న కొన‌సాగ‌డంతో స‌భ‌ను నేటి (మంగ‌ళ‌వారం)కి వాయిదా వేశారు.

హోం మంత్రిత్వ శాఖ జవాబుదారీతనం వహించాలి : ప్రతిపక్షాల డిమాండ్
పార్లమెంట్‌ ఆవ‌ర‌ణలో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. ప్ల‌కార్డులు చేతబూని కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు హోరెత్తించాయి. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాద‌వ్‌, ప్రియాంగ్ గాంధీ, జాన్ బ్రిట్టాస్, మ‌హువా మొయిత్రాతో పాటు ఇండియా బ్లాక్ పార్టీల ఎంపీలంతా ఈ ఆందోళ‌నలో పాల్గొన్నారు. విద్యార్థుల నిరసనలపై అణచివేతకు పాల్పడిన అమిత్ షాపై ప్ర‌తిప‌క్షాలు విమర్శలు గుప్పించాయి. విద్యార్థి నిరసనకారులపై పోలీసుల క్రూరత్వంపై హోం మంత్రిత్వ శాఖ జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశాయి. “ఇప్పుడు కావాల్సింది హోం మంత్రిత్వ శాఖ నుంచి జవాబుదారీతనం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో, అమాయక, బలహీన, శాంతియుత నిరసనకారులైన మన పిల్లలను వీధుల్లోకి లాక్కెళ్తూ, వారిపై ప్రొజెక్టైల్ గన్‌లు, పెల్లెట్ గన్‌లు, ఎలక్ట్రిక్ ఆయుధాలను ప్రయోగిస్తుంటే, ఎటువంటి జవాబుదారీతనం లేకుండా ఉండకూడదు” అని ప్రతిపక్ష సభ్యులు తెలిపారు. అంత‌కు ముందు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇండియా బ్లాక్ స‌మావేశం జ‌రిగింది. ఢిల్లీలో పోలీసుల దురాగతాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని ప్ర‌తిప‌క్షాలు నిర్ణ‌యించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -