రేషన్‌కార్డు ఆధారంగా వివరాల నమోదు
2 రోజుల్లో మీసేవ ద్వారా సర్టిఫికెట్
రెవెన్యూ శాఖ ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పౌర సేవలను మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’కు పచ్చజెండా ఊపింది. రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబ వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. మీ సేవ కేంద్రాల ద్వారా రెండు రోజుల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను జారీ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు జీవో నెంబర్ 172ను రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి డిఎస్ లోకేశ్‌కుమార్ సోమవారం జారీ చేశారు. ఈ కొత్త విధానం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలను ఒకే రికార్డులో నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ సేవలు పొందే సమయంలో కుటుంబ సభ్యుల వివరాలను నిర్ధారించేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కుటుంబానికి సంబంధించిన ధ్రువీకరించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచడం ద్వారా సేవల పంపిణీ మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతుందని తెలిపారు.
మీ సేవ ద్వారా దరఖాస్తు
కుటుంబంలోని మేజర్ సభ్యుడు మీ సేవ కేంద్రం లేదా మీ సేవ ఆన్‌లైన్ పోర్టల్/మొబైల్ యాప్ ద్వారా దర ఖాస్తు చేసుకోవచ్చని లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. నిర్దేశిత యూజర్ ఛార్జీలు చెల్లించి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దరఖాస్తు అందిన తర్వాత సంబంధిత తహశీల్దార్ రేషన్ కార్డు వివరాల ఆధారంగా పరిశీలించి డిజిటల్ సంతకంతో ఆమోదిస్తారని వివరించారు. దరఖాస్తు అందిన రెండు పని రోజుల్లోపు సర్టిఫికెట్ జారీ చేయా లని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సర్టిఫికెట్‌ను మీ సేవ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉంటుందని తెలిపారు.
తహసీల్దార్‌కు కీలక బాధ్యతలు
రేషన్ కార్డులో నమోదైన చిరునామా పరిధిలోని తహసీల్దార్‌నే సర్టిఫికెట్ జారీ చేసే అధికారిగా ప్రభుత్వం నియమించిందని లోకేశ్‌కుమార్ ప్రకటిం చారు. అన్ని దరఖాస్తులూ ఆటోమేటిక్‌గా సంబంధిత తహసీల్దార్ లాగిన్‌కు చేరుతాయని వివరించారు. ఆయన లేదా ఆమె వివరాలను ధృవీకరించి డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్‌ను ఆమోదిస్తారని తెలిపారు.
ఆస్తి హక్కులకు ఆధారం కాదు
ఫ్యామిలీ రిజిస్టర్ లేదా దాని ఆధారంగా జారీ చేసే సర్టిఫికెట్ కుటుంబ నిర్మాణాన్ని మాత్రమే ప్రతిబిం బించే రికార్డు అని లోకేశ్‌కుమార్ స్పష్టం చేశారు. దీనివల్ల ఎలాంటి ఆస్తి హక్కులు, వారసత్వ హక్కులు కలగబోవనీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్వయంగా అర్హత కూడా లభించబోదని పేర్కొన్నారు. ఈ సేవ అమలుకు అవసరమైన సాంకేతిక సమన్వయాన్ని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ చేపట్టాలనీ, పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డు వివరాలను వాడుకునే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు ఈ సేవ అమలును పర్యవేక్షించి, రెవెన్యూ అధికారులకు తగిన సూచనలు అందించాలని పేర్కొన్నారు. ఈ వివరాలను పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్న ఫుడ్ సెక్యూరిటీ కార్డు (రేషన్ కార్డు) వివరాల నుంచి ఎలక్ట్రానిక్ విధానంలో సేకరించి రిజిస్టర్‌లో నమోదు చేస్తారని వివరించారు.
ఫ్యామిలీ రిజిస్టర్‌లో నమోదు చేసే వివరాలు
రేషన్ కార్డు నెంబరే ఫ్యామిలీ రిజిస్టర్ గుర్తింపు సంఖ్యగా ఉంటుంది.
కుటుంబ పెద్ద పేరు :
కుటుంబ సభ్యుల పేర్లు :
కుటుంబ పెద్దతో సంబంధం :
వయస్సు, పుట్టిన తేదీ :
లింగం :
ఆధార్ నంబర్ :
పూర్తి చిరునామా (ఇంటి నంబర్, గ్రామం/వార్డు, మండలం, జిల్లా) :
తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌కు పచ్చజెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



