– అదానీ అవకతవకలు బయటపెట్టింది ఆయనే
– రాయిటర్స్ కథనం
న్యూఢిల్లీ : పరిశోధనాత్మక వార్తలు, కథనాలు అందించే భారతీయ పాత్రికేయుడు ఆనంద్ మంగ్నాలే ఫోన్‌లో పెగాసస్ స్పైవేర్ అమర్చారా? అయి ఉండవచ్చునని ఓ ఫోరెన్సిక్ నిపుణుడిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మంగ్నాలే ఫోన్‌లో అనుమానాస్పద వైఫల్యాలు కన్పించాయని, అవి గతంలో పెగాసస్ చొరబాట్లను పోలి ఉన్నాయని ఫోరెన్సిక్ సంస్థ ‘ఐ వెరిఫై’ రాయిటర్స్‌కు వివరించింది. ‘నేను అత్యంత నమ్మకంతో చెప్పగలను. మంగ్నాలే ఫోన్‌పై పెగాసస్ దాడి జరిగింది’ అని ఐ వెరిఫై వ్యవస్థాపకుడు రాకీ కోల్ చెప్పారు. ‘ప్రభుత్వ ప్రేరేపిత వ్యక్తులు మీ ఐఫోన్లను లక్ష్యంగా చేసుకోవచ్చు’ అంటూ గత నెల యాపిల్ సంస్థ నుండి హెచ్చరికలు అందుకున్న పాత్రికేయుల్లో మంగ్నాలే కూడా ఉన్నారు.
అయితే ఏ దేశం దాడులను ప్రోత్సహిస్తుందో యాపిల్ సంస్థ చెప్పకపోయినప్పటికీ పలువురు ప్రతిపక్ష నేతలు, కొందరు పాత్రికేయుల ప్రొఫైల్స్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని చూస్తే దాడులకు పాల్పడే వారి వెనుక కేంద్ర ప్రభుత్వమే ఉండవచ్చునన్న అనుమానాలు కలిగాయి.
మంగ్నాలే చెప్పిందేమిటి?
వ్యవస్థీకృత నేరాలు, అవినీతి వార్తల రిపోర్టింగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్‌పీ) నెట్‌వర్క్‌కు మంగ్నాలే దక్షిణాసియా సంపాదకుడు. పరిశోధనాత్మక వార్తలు అందించే పాత్రికేయులకు ఇది అంతర్జాతీయ నెట్‌వర్క్. ఓసీసీఆర్‌పీ కోసం పనిచేస్తున్న ఇతర పాత్రికేయులు రవి నాయర్, ఎన్‌బీఆర్ ఆర్కాడియోతో కలిసి మంగ్నాలే ఆగస్టులో అదానీ గ్రూపుపై వార్తా కథనాలు అందించారు. పారదర్శకత లేని మారిషస్ నిధులను ఉపయోగించి అదానీ గ్రూపు తన కంపెనీల విలువను భారీగా పెంచిందని వారు బయటపెట్టారు. ఇద్దరు మదుపుదారులు విదేశీ నిధుల ద్వారా అదానీ గ్రూపు కంపెనీలకు పెద్ద ఎత్తున సొమ్మును తరలించారని, ఇలా చేయడం స్టాక్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధమని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రయోజనం పొందారని తెలిపారు. మంగ్నాలే ఫోన్‌లో పెగాసస్‌ను చొప్పించడం ఆమోదయోగ్యం కాదంటూ ఓసీసీఆర్‌పీ సహ వ్యవస్థాపకుడు డ్రా సులివాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాత్రికేయులపై గూఢచర్యం జరపడంపై వివరణ అవసరం లేదు. ఇది కచ్చితంగా రాజకీయ ప్రయోజనం కోసమే’ అని ఆయన అన్నారు. ఇజ్రాయిల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ రూపొందించిన పెగాసస్‌ను కేంద్ర ప్రభుత్వం తన విమర్శకులపై ప్రయోగిస్తోందన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్పైవేర్‌ను ఉపయోగించి స్మార్ట్ ఫోన్లను హాక్ చేయవచ్చు. అందులోని సమాచారాన్ని, ఇతర వివరాలను పొందవచ్చు. మైక్రోఫోన్, కెమేరాలోకి కూడా ప్రవేశించవచ్చు. వ్యక్తులకు వచ్చే కాల్స్‌ను వినవచ్చు. సందేశాలు చదవవచ్చు.