ప్రజాబలాన్నే తన బలంగా భావించి
నేను ఒక యుగపురుషుడినని విర్రవీగిన
నాయకులెందరినో కాలగర్భంలో కలిపిన
చరిత్ర ప్రజలదే..
ఉద్యమానికి మద్దతిచ్చి, ఎన్నికలో ఓట్లనిచ్చి
నాయకులను యుగపురుషులుగా
తయారు చేసేది ప్రజలే..
అధికారం తమ చేతికి చిక్కాక
అహంకారంతో ఆ ప్రజలనే వంచించే వారిని
అధ:పాతాళంలోకి తొక్కేదీ ప్రజలే..
ఒకనాడు తను నడిపిన ఉద్యమ ఆకాంక్షల కోసం
వందలాది మంది ప్రాణాలర్పింది ప్రజలే..
తన వెంట నడిచిన కోట్లాదిమంది ప్రజలే..
ప్రతి ఎన్నికల్లో గెలిపించిందీ ప్రజలే..
అదంతా నా బలమే అని భావించి
ఇచ్చిన నినాదాలు, చేసిన బాసలు మరిచి
అమరవీరులను అటకెక్కించి,
ఉద్యమకారులను బయటకు పంపి,
ఉద్యమ ద్రోహులను, ధనవంతులను
అక్కున చేర్చుకుని,
తన పాలిత భూభాగాన్ని,
అప్రకటిత బందీఖానాగా మారిస్తే..
పాలిత ప్రజలను బానిసలుగా భావిస్తే…
ప్రజలను గొర్లను, బర్లను మలిపినట్లు
మలపొచ్చు అని భ్రమ పడితే
ఓటు ద్వారా తమశక్తిని ప్రదర్శించే
సమయం వచ్చినప్పుడు బండకేసి కొట్టేది ప్రజలే.
ఎందుకంటే నేడు బాంచన్ దొర అని
బతికే రోజులు కావు కాబట్టి.
మహోన్నతమైన భారత రాజ్యాంగం ద్వారా
మహానీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
అందించిన ఓటు అనే వజ్రాయుధం
తమ అమ్ములపొదిలో ఉంది కాబట్టి.
నాటి పాలకుల విధానాన్నే, మరో రూపంలో
నేటి పాలకులు అనుసరిస్తున్నారనే
కృతనిశ్చయానికి ప్రజలు వచ్చినట్టున్నారు.
అందుకే స్పష్టమైన తీర్పు ఇచ్చినట్టున్నారు.
బహుశా ఇదంతా స్వయం కృతాపరాధమేమో?
నేటి పాలకులు తమకు అందివచ్చిన
అవకాశాన్ని ఒడిసిపట్టుకుని,
గతంలో చేసిన తప్పులను సరిచేసుకుంటే.. సరి,
లేదంటే వీరి సంగతీ.. అదే సంగతి అవుతుంది మరి.
ఎందుకంటే చరిత్ర నిర్మాతలు ప్రజలే కాబట్టి.
– డి. సత్యానంద్, 9912973173