– తెలంగాణ ఎన్నికలు దేశ రాజకీయాలను మార్చాలి
– దేశంలో దుర్మార్గ పాలన సాగుతోంది
– బీజేపీకి బుద్ధి చెప్పాలి
– బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే..
– ఇబ్రహీంపట్నం సీపీఐ(ఎం) అభ్యర్థి పి.యాదయ్యను గెలిపించాలి: త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే అని, భవిష్యత్ కూడా ఎర్రజెండాకే ఉందని.. చట్టసభల్లో ప్రజల గొంతు వినిపించేందుకు సీపీఐ(ఎం) అభ్యర్ధులను గెలిపించాలని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్య విజయాన్ని కాంక్షిస్తూ పోల్కంపల్లి, దండుమైలారం, ఆరుట్ల గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు గ్రామీణ ఉపాధిహామీని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిసీపీఐ(ఎం) సాధించిందని గుర్తు చేశారు. దాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచలేని ఎన్ని పథకాలు ఉన్నా ప్రయోజనం లేదని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధిహామీ కూలి రూ.600లకు పెంచాలని, ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సి ప్రభుత్వం ప్రయివేటు పెట్టుబడిదారులకు తెగనమ్ముతుంద న్నారు. ఈ విషయంపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మౌనంగా ఉన్నాయని, వారికి అధికారం తప్ప ప్రజా సమస్యలు, దేశ భవిష్యత్తు పట్టదని చెప్పారు. ఇలాంటి నాయకులను చట్టసభల్లోకి పంపిస్తే ప్రజా సమస్యలపై ఏం మాట్లాడతారని నిలదీశారు. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి పేద, దళిత, గిరిజన, మహిళల హక్కులను కాలరాసే కుట్రలు కేంద్రంలో బీజేపీ చేస్తోందని, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ శత్రువులని ప్రజలను నమ్మిస్తున్నప్పటికీ కేంద్రంలో దోస్తీ నడుస్తోందని చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య, సాగునీరు, నిధులు, నియామకాల ఎజెండాతో తెలంగాణ ఉద్యమం మొదలైందని, కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఆ సమస్యలు పరిష్కారం కాక ప్రజల ఆశలు నీరుగారాయన్నారు. ప్రధానంగా విద్యా, వైద్య రంగంపై నిర్లక్ష్యం కనబడుతుందన్నారు. పూర్తిగా కార్పొరేట్‌మయం చేశారన్నారు. విద్యార్థులకు కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, సామాన్యునికి వైద్యం అందనంత దూరంలో ఉన్నాయని తెలిపారు. మరోవైపు నిరుద్యోగ సమస్య జఠిలంగా ఉందన్నారు. వాటిని పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ఈ ప్రాంతంలో ఎర్రజెండా అభ్యర్థులు మూడు దఫాలుగా గెలిచిన చరిత్ర ఉందన్నారు. కమ్యూనిస్టులు ప్రాతినిథ్యం వహించిన సమయంలో చట్టసభల్లో, బయట పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజాప్రాతినిథ్యం లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేసే శక్తి సామర్థ్యాలున్న ఎర్రజెండాను గెలిపించుకోవడం రాష్ట్ర ప్రజల ముందున్న కర్త్యవ్యమన్నారు. త్రిపురలో ఇద్దరు ఎమ్మెల్యేలతో మొదలై 56 మంది ఎమ్మెల్యేను గెలుచుకున్న చరిత్ర సీపీఐ(ఎం)కి ఉందన్నారు. బీజేపీ కుట్రలో భాగంగా ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కమ్యూనిస్టులను ఓడించిందన్నారు. అయినా అక్కడ ఉద్యమాలు ఆగలేదని, భవిష్యత్తు ఎర్రజెండాదేనని స్పష్టంచేశారు. తెలంగాణలోనూ కమ్యూనిస్టు అభ్యర్థులను ఆదరించి, ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, జయలకిë, వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి, ఉడుత రవిందర్, స్కైలాబ్‌బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, జగదీశ్, కవిత జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
న