– సీడబ్య్లూసీ సభ్యులు అల్కాలాంబ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈనెల 30న జరుగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పథకాలకు ఓటు వేస్తారని సీడబ్య్లూసీ సభ్యులు అల్కాలాంబ ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో ప్రకటించిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, మహిళలకు రూ. 2.500 నెలవారీ పారితోషికం, ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ. 500లకే వంట గ్యాస్ వంటి పథకాలను అమలుచేస్తామన్నారు. కర్నాటకలో రాష్ట్రంలో రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేశామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు. కరోనా సమయంలో ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగిందన్నారు. ఢిల్లీ ముఖ్యమంతి కేజ్రీవాల్, సీఎం కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్‌లో ఉన్నారని ఆరోపించారు. రూ.100 కోట్ల అవినీతి లిక్కర్ స్కామ్‌లో జరిగిందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు జవాన్లు మరణిస్తే, రక్షణ శాఖ మంత్రి మాత్రం పరోక్షంగా కారును గెలిపించే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు.
రేవంత్ హెలిక్యాప్టర్‌కు వాతావరణం దెబ్బ
టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, అద్దంకిదయాకర్, అయోధ్యరెడ్డి ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ వెనక్కి తిరిగొచ్చింది. వాతావరణం అనుకూలించక పోవడంతో కొద్దీ దూరం వెళ్లాక ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్‌మార్గం ద్వారా ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఎన్నికల.ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉన్నది. రోడ్ మార్గంలో వెళ్తుండడంతో సభలకు ఆలస్యమవుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇదిలా ఉండగా శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించాల్సిన ప్రచార కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేసినట్టు తెలిపారు.
కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ నేతల బహిష్కరణ
క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతున్న నలుగురు నాయకులను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం క్రమశిక్షణ విభాగం చైర్మెన్ జి చిన్నారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సస్పెండైన వారిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంజీవ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, నాయకులు భార్గవ్ దేశ్ పాండే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఉన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఏ సంపత్‌కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరు సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ
కాంగ్రెస్ పార్టీని, నాయకులను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని దాడులు చేసినా…ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇండ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని తెలిపారు. ఆ రెండు పార్టీల్లో చేరిన వాళ్లు పవిత్రులు…ప్రతిపక్షంలో ప్రజల తరుపున కొట్లాడే వాళ్లు ద్రోహులా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ అమిత్‌షా, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. మీ పతనం మొదలైందని ఆయన హెచ్చరించారు.