కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు

CPI alliance with Congress finalized– కొత్తగూడెం కేటాయింపు రెండు ఎమ్మెల్సీలకు హామీ
– సీపీఐ(ఎం)తో చర్చలు కొనసాగుతున్నారు : రేవంత్‌రెడ్డి
– నిరంకుశ బీఆర్‌ఎస్‌ను ఓడించాలి : నారాయణ
– ఈ స్నేహం కేంద్రంలో మార్పునకు దోహదపడాలి : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారైంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ నాయకులు దీపాదాస్‌ మున్షి, విష్ణుదాస్‌ సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు వచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డితో సుమారు గంటసేపు సమావేశమయ్యారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ ఆదేశాల మేరకు సీపీఐతో ఒప్పందానికి వచ్చామని చెప్పారు. దేశ రాజకీయాలు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాయనీ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ఇండియా కూటమిగా ఎన్నికలకు వెళ్లి ఎన్డీఏ కూటమిని ఓడించాలన్నారు. అందులో భాగంగానే సీపీఐతో పొత్తు ఖాయమైందని చెప్పారు. ఆ పార్టీకి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీ స్థానా లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సీపీఐ పోటీ చేసే కొత్తగూడెంలో గెలిచేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. కమ్యూనిస్టులు పేదలు, సామా న్యుల సమస్యలను ప్రస్తావిస్తారని చెప్పారు. శాసన సభ, శాసనమండలిలో వారి ప్రాతినిధ్యం ఉండాల న్నారు. రాజకీయ పరిస్థితులు, ఒత్తిడులపై వివరిస్తా మని అన్నారు. వారు అర్థం చేసుకుని ఎన్నికల్లో సహ కరించాలని కోరారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా కోదండరామ్‌ కూడా కాంగ్రెస్‌కు సహకరిస్తు న్నారని చెప్పారు. భవిష్యత్తులో అన్ని విషయాలపై సమన్వ యం కోసం కమిటీ వేస్తామ న్నారు. ఏఐసీసీ నాయ కులు దీపాదాస్‌ మున్షి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్‌ కలిసి పని చేస్తుందన్నారు. ఇది తెలంగాణకు శుభపరిణామమని అన్నారు. ఈ స్నేహం భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్నారు.
సీపీఐ(ఎం)తో కొనసాగుతున్న చర్చలు : రేవంత్‌
సీపీఐ(ఎం)తో చర్చలు కొనసాగుతున్నాయని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ అంశం పరిష్కారమవుతుందనీ, జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సీపీఐతో చర్చలు కొలిక్కి రావడంతో ఇక్కడకు వచ్చానని వివరించారు. సీపీఐ(ఎం)తోనూ అదే తరహాలో ఉంటుందన్న ఆశ ఉందన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థులను ప్రకటించిం దన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ అభ్యర్థులను ప్రక టించినా సహకరించుకునే పరిస్థితి రాజకీయాల్లో ఉంటుందని చెప్పారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటామని అన్నారు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించాలంటే ఇరు పక్షాలు చర్చించుకుని పరిష్కారం దిశగా పయనించాలని అన్నారు. ఎప్పటి వరకు స్పష్టత వస్తుందన్న ప్రశ్నకు వేచి చూద్దామంటూ ఆయన సమాధానమిచ్చారు.
కేసీఆర్‌ నియంత పాలనలో దగాపడ్డ తెలంగాణ : నారాయణ
సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలనలో తెలంగాణ దగా పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. ప్రజానీకాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. మోడీకి వ్యతి రేకంగా ఉండే పార్టీలు, సంస్థలు, ముఖ్యమంత్రుల పై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఛత్తీస్‌ ఘడ్‌లో కాంగ్రెస్‌ మంచి పాలన అందిస్తున్నా మోడీ ప్రభుత్వం దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. ఇది నీచ సంస్కృతికి నిదర్శనమని చెప్పారు. రాష్ట్రం లో బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంకు తేడాలేదనీ, ఒకతాను ముక్కలేనని అన్నారు. దేశంలో ప్రత్యామ్నా యం పేరుతో ఇండియా కూటమికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ప్రయత్నిస్తున్నాయనీ, ప్రత్యక్షం గా, పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నాయని వివరించారు. మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకుండా బండి సంజరును ఇంటికి పంపించారని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య పరస్పర అవగాహన ఉంది కాబట్టే కవితను అరెస్టు చేయలేదన్నారు. అంతకు మించిన దొంగలు బయట ఉన్నారనీ, సిసోడియాను అరెస్టు చేశారని అన్నారు. పెద్ద కుంభకోణాలు చేసిన వారున్నా వారి జోలికి పోవడం లేదనీ, కొందరిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిం చారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని కాపా డ్డమే తమ లక్ష్యమన్నారు. ప్రజలను కాపాడాలనీ, ఫాంహౌజ్‌ రాజకీయాన్ని ఓడించాలని చెప్పారు. అనివార్య పరిస్థితుల్లోనే ఒక స్థానంలో పోటీ చేస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న సానుకూల వాతావరణం కనిపిస్తున్నదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పోవాలనీ, కర్నాటక తరహాలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని అన్నారు. ఇక్కడ వచ్చే మార్పు దేశంలోనూ మార్పునకు దోహదపడా లని ఆకాంక్షించారు. ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలన్నారు. నిర్బంధం కాకుండా స్వేచ్ఛ ఉండా లని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కార్య క్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, బి హేమంతరావు, ఈటి నరసింహా, బాలనర్సింహా, విఎస్‌ బోస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love