కమ్యూనిస్టు అభ్యర్థిపై స్వల్ప ఆధిక్యం
లిమా : దక్షిణ అమెరికా దేశమైన పెరూలో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో కన్సర్వేటివ్ అభ్యర్థి కైకో ఫుజిమోరీ విజయం సాధించారు. వారాల తరబడి జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 2011, 2016, 2021 ఎన్నికలలో ఓటమి చవిచూసిన కైకో ఫుజిమోడీ తన నాలుగో ప్రయత్నంలో గట్టెక్కారు. మాజీ అధ్యక్షుడు అల్బర్టో ఫుజిమోరీ కుమార్తె అయిన కైకో జూన్ 7న జరిగిన ఎన్నికలలో విజయం సాధించారని ఎన్నికల కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రకటన విడుదలైన తర్వాత కైకో ఫుజిమోరీ తనకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. పెరూ నూతనాధ్యాయాన్ని ప్రారంభిస్తోందని ఆమె తెలిపారు. బాధ్యతాయుతంగా, వినయంగా వ్యవహరిస్తానని, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని చెప్పారు.
పాపులర్ ఫోర్స్ పార్టీ నేత కైకో ఫుజిమోరీ తన సమీప టుగెదర్ ఫర్ పెరూ పార్టీకి చెందిన వామపక్ష అభ్యర్థి రాబర్టో సాంఛెజ్‌పై 49,641 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కారు. కైకోకు 50.13 శాతం ఓట్లు రాగా సాంచెజ్‌కు 49.86 శాతం ఓట్లు లభించాయి. ఈ నెల 28న కైకో దేశాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేస్తారు. రాజకీయ అస్థిరత కారణంగా కైకోకు ముందు గడచిన దశాబ్ద కాలంలో పెరూకు ఎనిమిది మంది అధ్యక్షులు పనిచేశారు. వివిధ ఆరోపణలపై ఆమె తండ్రి అల్బర్టో ఫుజిమోరీ 2000లో పదవీచ్యుతుడై జైలుశిక్ష అనుభవించారు. 2023లో ఆయనకు క్షమాభిక్ష లభించింది.
ఓవర్‌సీస్ ఓటింగులో అక్రమాలు : సాంఛెజ్
ఓవర్‌సీస్ ఓటింగ్‌లో అక్రమాలు జరిగాయని కమ్యూనిస్టు అభ్యర్థి సాంఛెజ్ ఆరోపించారు. దీనిపై మానవ హక్కుల ఇంటర్`అమెరికన్ కమిషన్ (ఐఏసీహెచ్‌ఆర్)కు అప్పీలు చేస్తానని ఆయన చెప్పారు.



