Monday, July 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో శ్వేతజాతి ఆధిపత్యం

అమెరికాలో శ్వేతజాతి ఆధిపత్యం

- Advertisement -

ట్రంప్ పాలనలో కానరాని సమానత్వం, ప్రజాస్వామ్యం
ఓటింగ్ హక్కులపై నిరంతర దాడులు
కమ్యూనిస్టులను తుడిచిపెడతామంటూ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా శనివారం నాడు 250వ వ్యవస్థాపక వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ రెండున్నర శతాబ్దాల కాలంలో అమెరికా ఎంతగానో పురోగమించిందన్నది వాస్తవం. అయితే అదే సమయంలో ఆంతరంగికంగా…ముఖ్యంగా సొంత నేతల నుంచే తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. దేశంలో సమానత్వం, ప్రజాస్వామ్యం అనేవి గత శతాబ్డ కాలంలో ఎన్నడూ లేని విధంగా నేడు వివాదాస్పదం అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం జాతీయ స్వభావపు వైవిధ్యాన్ని తుడిచిపెట్టాలని చూస్తోంది. పౌర హక్కులను హరించడం, ఆఫ్రికన్ – అమెరికన్ సైనిక నాయకుల విషయంలో వివక్ష ప్రదర్శించడం, శ్వేతజాతీయుల శరణార్థి కార్యక్రమాలను రద్దు చేయడం, హైతీయులను ద్వేషించడం, హిస్పానిక్ వలసదారులను అత్యంత అధ్వాన్నమైన వారుగా హేళన చేయడం…ఇలా ప్రతి విషయంలోనూ శ్వేతజాతి ఆధిపత్యం, శ్వేతజాతి జాతీయవాదం అంతర్లీనంగా కన్పిస్తున్నాయి.

ఆశయాలకు దూరంగా…
2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను రద్దు చేసేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు మొదలుకొని ఇప్పుడు ఓటింగ్ హక్కులు, ప్రాతినిధ్యంపై ఆయన చేస్తున్న నిరంతర దాడుల వరకూ జరిగిన పరిణామాలను గమనిస్తే స్వేచ్ఛాయుత ఎన్నికలు, మెజారిటీ పాలన, ప్రజాస్వామ్యం…ఇవే అధ్యక్షుని లక్ష్యాలని అర్థమవుతుంది. కాంగ్రెస్‌లోని ఆఫ్రికన్అ-మెరికన్ సభ్యులలో మూడింట ఒక వంతు మందిని తొలగించాలన్నది ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం. ఓటింగ్ హక్కుల చట్టంలోని రక్షణలను సుప్రీంకోర్టు ఇప్పటికే తొలగించింది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని కష్టతరం చేస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలలో ఓటర్లను భయపెట్టడానికి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)ను రంగంలోకి దింపుతామని ట్రంప్ మద్దతుదారులు బెదిరిస్తున్నారు. రెండున్నర శతాబ్దాల కాలంలో అమెరికా ఎక్కడ ఉంది, ఎటు వెళుతోంది అనే విషయాలపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్ర ప్రకటనలో పొందుపరచిన ఆశయాలకు అనుగుణంగా అమెరికా ముందుకు సాగడం లేదని క్వినిపియాక్ యూనివర్సిటీ నిర్వహించిన పోల్‌లో ఏకంగా 61 శాతం మంది అభిప్రాయపడ్డారు.

కమ్యూనిస్టులపై అక్కసు
వ్యవస్థాపక వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ట్రంప్ కమ్యూనిస్టులపై అక్కసు వెళ్లగక్కారు. ప్రగతిశీల డెమొక్రాట్ల ‘కమ్యూనిస్టు’ ముప్పు నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘దేశంలోకి కొత్తగా వచ్చిన వారు మన జీవన విధానానికి, మన విజయాలకు వ్యతిరేకమైన భావజాలాన్ని స్వీకరిస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు కమ్యూనిస్టు ముప్పు మరోసారి విజృంభిస్తోంది. దీనిని మేము సాగనివ్వం’ అని చెప్పారు. ‘అమెరికా సంయుక్త రాష్ట్రాల పౌరులమైన మేము త్వరలోనే కమ్యూనిస్టులను ఓడిస్తామని అందరూ వినేలా ప్రమాణం చేస్తున్నాము. మేము వారిని త్వరలోనే తరిమేస్తాం. దేశాన్ని మునుపెన్నడూ లేనంత బలంగా నిర్మిస్తాం. అమెరికా ఎన్నటికీ కమ్యూనిస్టు దేశం కాబోదు. కమ్యూనిజం క్యాన్సర్ వంటిది. దానిని కోసి పారేయాలి. అది కూడా చాలా వేగంగా…’ అని అన్నారు. నవంబరులో అమెరికాలో జరిగే మధ్యం తర ఎన్నికలలో రిపబ్లికన్లు కాంగ్రెస్‌లోని ఓ సభపై పట్టు కోల్పోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వామపక్ష డెమొక్ట్రాట్ అభ్య ర్థులు ఇటీవల వరుస విజయాలు సాధిస్తు న్నారు. న్యూయార్క్, కొలరాడోలలో జరిగిన డెమొక్రటిక్ ప్రైమరీల పోరులో ముగ్గురు డెమొక్రటిక్ సోషలిస్టులు సహా నలుగురు ప్రగతిశీల అభ్యర్థులు ఎన్నిక య్యారు. కెంటకీ, న్యూజెర్సీ, ఓహియో, పెన్సిల్వేనియా, టెక్సాస్‌ లో కూడా ప్రగతిశీల అభ్యర్థులదే పైచేయి అయింది. ఈ విజయాలపై ట్రంప్ వ్యాఖ్యానిస్తూ ‘దేశం ఏర్పడినప్పటి నుంచి ఎదురైన అతి పెద్ద ముప్పు ఇదే’ అని చెప్పారు.

ఎన్నికల ప్రచార తరహాలో…
ట్రంప్ ప్రసంగం ఎన్నికల ప్రచారం మాదిరిగా సాగింది. దేశంలో కమ్యూనిస్టులు పట్టు సాధించవచ్చునని హెచ్చరిస్తూ ఓటింగ్‌పై ఆంక్షలు విధించాలన్న తన డిమాండును పునరుద్ఘాటించారు. స్వదేశంలోనూ, విదేశాలలోనూ ఎదురవుతున్న సైద్ధాంతిక ముప్పును ప్రస్తావించారు. మెయిన్ బ్యాలెట్‌ను పరిమితం చేసే, ఓటు నమోదు కోసం పౌరసత్వ రుజువును తప్పనిసరి చేసే చట్టాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరారు. అమెరికా గుర్తింపుపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. ట్రంప్‌కు ముందు పనిచేసిన అమెరికా అధ్యక్షులు జూలై 4 వేడుకలకు వ్యక్తిగతంగా హాజరైన ఉదంతాలు లేవు. అయితే ట్రంప్ మాత్రం అధికారిక కార్యక్రమానికి, ప్రచార తరహా రాజకీయాలకు మధ్య ఉన్న గీతను చెరిపేశారు. 2019లో కూడా ట్రంప్ ఇలాంటి ప్రసంగమే చేశారు.

అధ్యక్షుడిగా మూడోసారి.. ట్రంప్‌ నర్మగర్భ వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. అధ్యక్ష భాధ్య తలు నిర్వర్తిస్తుండటం ఇది మూడోసారి అని చెప్పుకొన్నారు. నిజానికి ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారే. అయినప్పటికీ.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ తన విజయాన్ని దోచుకున్నారని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దాన్ని కూడా తన ఖాతాలో వేసుకోని మూడోసారి అధ్యక్షుడిని అని అన్నారు. అంతలోనే నవ్వుకుంటూ వివాదాస్పద అంశాల జోలికి పోవాలనుకోవట్లేదంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -