పాపం పసివాళ్లు

Pity babies– ఒకే గదిలో నాలుగు అంగన్‌వాడీ సెంటర్లు
– అదే గదిలో వంట సరుకులు..వంట
– ఎనిమిదేండ్లుగా అక్కడే..
– ఈ విద్యా సంవత్సరంలోనైనా విముక్తి కలిగేనా?
నవతెలంగాణ – ముస్తాబాద్‌
పసివాళ్లు.. ప్రశాంతంగా ఆడుతూపాడుతూ గడిపేందుకు.. పిల్లలు పడుకునేందుకు విశాలంగా ఉండాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు.. ఇరుకు గదుల్లో.. అదీ ఒకే గదిలో నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలను నడిపిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఎనిమిదేండ్లుగా అక్కడే చిన్నారులు సతమతమవుతున్నారు. ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పిల్లలకు చిన్న వయస్సు నుండే బలమైన పౌష్టిక ఆహారంతోపాటు మంచి విద్యాబుద్ధులు అలవడేలా అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. కానీ సొంత భవనాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, అద్దె గదుల్లో ఒక్కో చోట రెండు, నాలుగేసి సెంటర్లతో నెట్టుకొస్తున్నారు. ఆ కేంద్రాలకు ప్రభుత్వం అందించే సరుకులు కూడా అదే గదిలో భద్రపరచడంతో చిన్నారులు, టీచర్లు, ఆయాలు నానా తంటాలు పడుతున్నారు. సొంత భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రారంభించిన భవనాల పనులను కూడా కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో 22గ్రామాలు ఉండగా, అంగన్వాడీ కేంద్రాలు 52 ఉన్నాయి. అందులో సొంత భవనాలు ఏడు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ చాలీచాలని ఇరుకైన ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక గదిలో నడిపిస్తున్నారు. ముస్తాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకే గదిలో నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు సామాగ్రి కూడా అందులోనే ఉంచి, అందులోనే వంట చేస్తూ చాలా ఇబ్బందుల మధ్య గడుపుతున్నారు. ఈ నూతన విద్యా సంవత్సరంలోనైనా సెంటర్లకు భవనాల సాకారానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంతంగా గదులు అందుబాటులోకి వచ్చేదాకా సెంటర్లు అన్నింటికీ విడివిడిగా ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Spread the love