స్కూల్‌ యూనిఫాం తయారీకి ప్రణాళిక

– పొదుపు సంఘాల మహిళలకు స్ట్రిచింగ్‌ బాధ్యతలు
– జూన్‌ 12 వరకు ఒక్కో విద్యార్థికి ఒక జత దుస్తులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ రెండు జతల చొప్పున ఏకరూప దుస్తుల (యూ నిఫాం)ను పంపిణీ చేయడానికి ముందస్తు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుట్టు కూలి చార్జీలు, యూనిఫాం ఆకతులతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో జతకు కుట్టు కూలిగా రూ.50 చొప్పున రెండు జతలకు రూ.100 చెల్లించడానికి నిధులు కేటాయించారు. జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనంగా మరో రూ.25 చెల్లించనున్నారు. అంటే ఒక్కో జతకు రూ.75, రెండు జతలకు రూ.150 చెల్లించనున్నట్టు డీఆర్డీఓ అధికారి తెలిపారు.
స్వయం సహాయ సంఘాలకు అప్పగింత
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 89,565 మంది విద్యార్థులకు యూనిఫాం అందించనున్నారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టీఎస్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ సొసైటీ) ద్వారా విద్యార్థులకు యూనిఫాం, క్లాత్‌ పంపిణీ చేసి స్ట్రిచింగ్‌ బాధ్యతలను డీఆర్డీఏ ద్వారా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. కుట్టు పనిలో నైపుణ్యం కలిగిన స్వయం సహాయక బందాలను గుర్తించి వారికి విద్యార్థుల కొలతలు అందించే ప్రక్రియ పూర్తి చేసి, దుస్తులు కుట్టే పనులు మొదలయ్యాయి. విద్యార్థుల కొలతలను తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన ఆకతుల్లో యూనిఫాం తయారు చేసి జూన్‌ 12వ తేదీ నాటికి ఒక్కో విద్యార్థికి ఒక జత చొప్పున పాఠశాలలకు అందించేందుకు డీఆర్డీఓ అధికారులు ప్లాన్‌ చేసుకున్నారు.
జిల్లాలో ఇలా..
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 507 ప్రభుత్వ పాఠశాలల్లో 89,565 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థికీ రెండు జతల బట్టలు అందజేయాల్సి ఉంటుంది. ఈ నెల 12వ తేదీన పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఒక్కో విద్యార్థి ఒక జత అందజేసేందుకు డీఆర్డీఓ అధికారులు చర్యలు చేపట్టారు. ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని 5 గ్రామీణ మండలాలు, 8 మున్సిపాల్టీల్లో స్వయం సహాయ సంఘాలతో యూనిఫాంలు కుట్టిస్తున్నారు. గ్రామీమ మండలాల్లో 125 పాఠశాలలకుగాను 11,278 మంది విద్యార్థులకు, మున్సిపాల్టీల్లో 117 పాఠశాలలకు గాను 9,921 మంది విద్యార్థులకు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని 265 పాఠశాలలకు గాను 28,330 మంది విద్యార్థులకు బట్టలను కుడుతున్నారు. మండలం, జిల్లాలోని ఐదుగురు డీవీఎంలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షి స్తున్నారు. ఇందుకుగాను జిల్లాలో 150 కుట్టు మిషన్లకు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేయించారు.
యూనిఫాం ఇలా..
విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో యూనిఫాం ఆకతులను గతేడాది ప్రభుత్వం నిర్దేశించింది. 1వ తరగతి నుంచి 3వ తరగతి చదువుతున్న బాలికలకు ఫ్రాక్‌తో కూడిన డ్రెస్‌, 4, 5వ తరగతి బాలికలకు స్కర్ట్‌, 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు పంజాబీ డ్రెస్‌ ఆకర్షణీయంగా డిజైన్‌ చేశారు. అలాగే 1 నుంచి 7వ తరగతి చదువుతున్న బాలురకు షర్ట్‌, నిక్కర్‌, 8 నుంచి 12వ తరగతి బాలురకు షర్ట్‌, ప్యాంటుతో పాటు బూడిద రంగు చెక్స్‌ కలిగిన క్లాత్‌ నిర్ణయించారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ద్వారా యూనిఫాం క్లాత్‌ పంపిణీ చేశారు.

జూన్‌ 12న పంపిణీ చేసేలా ప్రణాళిక
ఈ నెల 12వ తేదీ వరకు ఒక జత యూనిఫాం అందిస్తాం. డీఈఓ సహకారంతో పొదుపు సంఘాల మహిళలకు డ్రెస్సులు కుట్టించే బాధ్యతలు అప్పగించేందుకు శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారత దిశగా జిల్లాలో కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. అవసరం మేరకు బ్యాంకులు, శ్రీనిధి ద్వారా రుణాలు అందించి పర్మినెంట్‌ కేంద్రాలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
– సాంబశివరావు, డీఆర్డీఓ, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా

Spread the love