ఫ్రెండ్లీ ప్రభుత్వంలో పెన్షనర్ల అగచాట్లు..

నవతెలంగాణ కంటేశ్వర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు, పెన్షనర్ల, వారి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణినీ అవలంబిస్తోందని, గత తొమ్మిది సంవత్సరాలుగా పెన్షనర్ల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘాలతో ఒక్క సమావేశమైన జరపని   ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ ని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు ఆరోపించారు. ఈ మేరకు గురువారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జరిగిన పెన్షనర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల పరిమితి ముగిసినా పీఆర్సీ కమిటీని ఇంతవరకు వేయలేదని, బకాయి పడ్డ డి ఏ లు ఇంతవరకు మంజూరు కాలేదని, నగదు రహిత వైద్యం గురించి గతంలో చెప్పిన మాటలు ,ఆచరణలో అవి అమలుకు నోచుకోవటం లేదని, ప్రభుత్వా నిర్లక్ష్యం ఈ పథకం అమలులో ప్రత్యక్షంగా కనబడుతోందని ఆయన అన్నారు. మెడికల్ రీయంబర్స్మెంట్  నెల లోపల బిల్లు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దానిని అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల కు పైగా పెన్షనర్లు ఉన్నారని, 30 నుండి 40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించిన వీరి పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని, వయోభారంతో చేయూతనియకపోతే అదొక సామాజిక సమస్యగా మారిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉద్యోగుల, పెన్షనర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని, పెన్షన్ పై దాడికి ఉపక్రమిస్తున్నాయని, పెన్షన్ లో సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.  ఈ సమావేశంలో ఇంకా జిల్లా నాయకులు జార్జ్, భోజరావు, శిర్ప హనుమాన్లు , అందే సాయిలు , ఫ్లారెన్స్, ప్రసాద్ రావు , లావు వీరయ్య, తదితరులు మాట్లాడారు.
Spread the love