– రాత్రంతా స్టేషన్‌లో పెట్టి కొట్టారంటున్న బాధితురాలు
– కేసు నమోదు
– ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
నవతెలంగాణ-హయత్ నగర్
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో దారుణ ఘటన జరిగింది. తనను రాత్రంతా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉంచి పోలీసులు లాఠీలతో కొట్టారని ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేటలోని నందిహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ ఈనెల 15న అర్ధరాత్రి ఇంటికి వెళ్తుండగా ఎల్బీనగర్ సర్కిల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో లాఠీలతో కొట్టారు. రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచి 16న తెల్లవారుజామున ఆమెను విడుదల చేశారు. తన తల్లిని పోలీసులు కొట్టి రూ. 3 లక్షలు, కొంత బంగారం అపహరించారని, నిందితులను అరెస్టు చేయాలని బాధితురాలి కూతురు ఈ మేరకు 16న ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలను ఎల్బీనగర్ పోలీసులు ఖండించారు. ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ జంక్షన్ వద్ద ముగ్గురు మహిళలు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని సమాచారం వచ్చిందని.. ఈ మేరకు 16న తెల్లవారుజామున మహిళను తీసుకొచ్చి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ ఘటనపై స్పందించిన రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్.. మహిళపై దాడికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ ఘటనపై మంత్రి సత్యవతి పోలీసులను ఆరాతీసినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది.