సామూహిక లైంగికదాడిపై పోలీసుల విచారణ ముమ్మరం

– అదుపులో అనుమానితులు
– బాలిక అంత్యక్రియలకు ఒత్తిడి చేసిన కాంట్రాక్టర్‌
నవతెలంగాణ – పెద్దపల్లి టౌన్‌
పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మైనర్‌పై నలుగురు యువకులు లైంగికదాడి చేయడంతో.. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను చికిత్స కోసం ప్రయివేటు వాహనంలో స్వరాష్ట్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. నాలుగు రోజుల కిందట(ఆగస్టు 14) అప్పన్నపేట శివారులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ పనులు పర్యవేక్షిస్తున్న సూపర్‌వైజర్‌ ఫయాజ్‌ బాలికకు మాయమాటలు చెప్పి శివార్లలోకి తీసుకెళ్లాడు. అతడితోపాటు మరో ముగ్గురు కలిసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయం బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌ గోపాల్‌కు తెలియడంతో ఈ సమస్య తన మెడకెక్కడ చుట్టుకుంటుందోనని బాలికను, ఆమె కుటుంబ సభ్యులను తిరిగి మధ్యప్రదేశ్‌కు పంపించే ప్రయత్నం చేశాడు. మార్గమధ్యలో బాధితురాలు మృతిచెందింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని కజరీకి తీసుకెళ్లి బాలిక అంత్యక్రియలు పూర్తి చేయాలని బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌ కుటుంబీకులను బలవంత పెట్టాడు. అయితే, హైదరాబాద్‌లో పనిచేస్తున్న బాలిక సోదరుడి రాక కోసం కుటుంబీకులు అంత్యక్రియలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ఫయాజ్‌తోపాటు మరో నిందితుడు హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. సామూహిక లైంగికదాడి తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్టు బాలిక చివరి మాటలను బంధువులు ఆడియో రికార్డు చేశారు. గురువారం ఉదయం రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అప్పన్నపేటలో స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పెద్దపల్లి పోలీసులు బాలిక స్వగ్రామం వెళ్లి బంధువులను విచారిస్తున్నారు.

Spread the love