నేడు రెండు రాష్ట్రాల్లో పోలింగ్‌

Polling in two states today– మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో నేడే (శుక్రవారం) పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు రెండు రాష్ట్రాల ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఇది రెండో విడత పోలింగ్‌ కాగా మధ్యప్రదేశ్‌లో ఈసారి ఉత్కంఠభరితమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ప్రత్యక్ష పోటీ నెలకొంది. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు జరిగే పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 5.6 కోట్లు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 2.88 కోట్లు. మహిళా ఓటర్లు 2.72 కోట్లు. రాష్ట్రంలో తొలిసారిగా మొత్తం 22.36 లక్షల మంది యువత ఓటు వేయనున్నారు. 2,533 మంది అభ్యర్థులు తమ అదష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ రెండు ఓట్ల తేడాతో మెజారిటీ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ, బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆపరేషన్‌ ఆకర్ష్‌ దెబ్బకు కాంగ్రెస్‌ సర్కార్‌ కూలిపోయి శివరాజ్‌ సర్కార్‌ గద్దెనెక్కింది. కానీ అక్కడ బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లోనూ..
ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాలకు మొదటి విడతలో నవంబర్‌ 7న పోలింగ్‌ జరిగింది. కాగా తుదివిడతగా మిగిలిన 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 827 మంది పురుష అభ్యర్థులు కాగా 130 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే ఒక థర్డ్‌ జెండర్‌ అభ్యర్థి కూడా బరిలో నిలిచారు. రెండో విడత పోలింగ్‌కు రాష్ట్రంలోని కోటి 63 లక్షల 14 వేల 479 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 81 లక్షల 41 వేల 624 మంది పురుష ఓటర్లు, 81 లక్షల 72 వేలా 171 మంది మహిళా ఓటర్లు, 684 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. ఓటింగ్‌ సజావుగా సాగేందుకు మొత్తం 18 వేల 833 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 700 సంగ్వారీ పోలింగ్‌ కేంద్రాలు కూడా తయారు చేయబడ్డాయి, ఇక్కడ మహిళా పోలింగ్‌ సిబ్బందిని మాత్రమే ఉంచుతారు.ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని అధికారులు కోరారు. పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన ఈవీఎంలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Spread the love