ప్రధాని మోడీకి ప్రయివేటీకరణ పిచ్చి

To Prime Minister Modi Privatization is madness– సంస్కరణల పేరుతో అన్నింటిని అమ్మేస్తుండు
– రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కోత పెట్టారు
– కాంగ్రెస్‌ వస్తే పథకాలు దరిచేరవు
– ఒక్క ఛాన్స్‌ ఇస్తే.. పంటికి అంటకుండా మింగుదామనా..?
– తెలంగాణ లౌకిక రాష్ట్రంగానే ఉంటుంది : ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి/కమ్మర్‌పల్లి/ధర్మపురి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రయివేటీకరణ పిచ్చి పట్టిందని, సంస్కరణల పేరుతో కేంద్రం అన్నింటినీ ప్రయివేటుపరం చేస్తూ, తన ఆప్తులకు అందిస్తున్నారని విమర్శించారు. బాయికాడ మీటర్లు పెట్టాలని.. తనపై ఒత్తిడి తెచ్చి బెదిరించినా తలొగ్గలేదని తెలిపారు. దాంతో తెలంగాణపై కక్షగట్టి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల్లో కోతపెట్టారని, సంవత్సరానికి రూ.5వేల కోట్ల చొప్పున గడిచిన ఐదేండ్లలో రూ.25 వేల కోట్ల నష్టం రాష్ట్రానికి వాటిల్లిందని తెలిపారు. అయినప్పటికీ రైతుల శ్రేయస్సు కోసం మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశానని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లా ధర్మపురి నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు.నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలువడమే కాదు, వీళ్ల గెలుపుతోనే రాష్ట్రంలో పార్టీ గెలుస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ వంటి పార్టీలు ఎన్నికల్లో నిలబడ్డా, ఏ పార్టీ చరిత్ర ఏంటో, ఏ పార్టీ ప్రజలకు ప్రయోజనం కలిగించిందో ఆలోచన చేయాలన్నారు. ఓటు అనేది మన కిస్మత్‌ను నిర్ణయించేదని, వజ్రాయుధమే ఓటు అన్నారు. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే తలరాతనే మారుస్తుందని, అందుకే ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు.
ఒక్క ఛాన్స్‌ ఇస్తే.. పంటికి అంటకుండా మింగుదామనా..?
దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్ల పాటు ఏకదాటిగా పాలించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నదని, ఒక్క చాన్స్‌ ఇస్తే పంటికి అంటకుండా మింగుతరా అని కాంగ్రెస్‌ నాయకులను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కన్నా ముందు చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండేవారని, అప్పుడు ఏం జరిగిందో.. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏం జరిగిందో చర్చించి ఓట్లేయాలని ప్రజలను కోరారు. మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్‌ రాజ్యం రావాలా.. 24 గంటలు కరెంటు ఇచ్చే బీఆర్‌ఎస్‌ కావాలా అని ప్రజలను ప్రశ్నించారు.
తెలంగాణ సెక్యులర్‌ రాష్ట్రంగానే ఉంటుంది
తాను బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్‌ రాష్ట్రంగానే ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 4లక్షల పోడు పట్టాలు జారీ చేశామని, పాత కేసులను రద్దు చేశామని, 4వేల గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దామని.. ఇక్కడ వారే పాలకులుగా మారారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ 10ఏండ్ల పాలనలో ఎలాంటి కరువు, కర్ఫ్యూ, మతకల్లోలాల వంటివి లేవని తెలిపారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాండ్లు దళితులు అణిచివేయబడ్డారని, వీరి అభివృద్ధి నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇలాంటి పరిస్థితి ఉండేదా అని వ్యాఖ్యానించారు. దేశంలో తొలి సారి దళితబంధు తీసుకొచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని తెలిపారు. మేనిఫెస్టో లో పొందుపర్చిన అన్ని అంశాలను అమలు చేస్తామని రాష్ట్రంలో 93లక్షల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం, పింఛన్లను క్రమంగా రూ.5వేలకు పెంచడం, రైతుబంధును రూ.16వేల వరకు అందజేయడం, సౌభాగ్యలక్ష్మీ పేరిట రూ.3వేలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే.. మళ్లీ పైరవీకారులు పుట్టుకొస్తారని అన్నారు. కైలాసం ఆటలో పెద్దపాము మింగి నట్టు అవుతుందన్నారు. ఎన్నికల కమిషన్‌ పర్మిషన్‌ ఇస్తే వారం, పది రోజుల్లో రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తామని తెలిపారు. ఆయా సభల్లో.. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్న గారి జీవన్‌రెడ్డి, బీగాల గణేష్‌ గుప్తా, బీఆర్‌ఎస్‌ ఖానాపూర్‌, బోథ్‌ అభ్యర్థులు జాన్సన్‌నాయక్‌, అనిల్‌జాదవ్‌, నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, మాజీ ఎమ్మెల్సీలు బిజీ గౌడ్‌, నిర్మల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ, ఎమ్మెల్సీ దండే విఠల్‌, మాజీ ఎంపీ గోడం నగేష్‌, బీఆర్‌ఎస్‌ మాజీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love