– వీటిని పారదోలేందుకు కృషి చేస్తున్నాం
– సెప్టెంబర్ 17 తెలంగాణకు ఒక ప్రత్యేకమైన రోజు
– ఆ నాటి త్యాగధనుల స్ఫూర్తిని స్మరించుకుందాం : జాతీయ సమైఖ్యతా దినోత్సవంలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ సమైఖ్యతకు విఘాతం కలిగించే అంశాల్లో అత్యంత కీలకమైనవి ఆర్థిక సమస్యలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గన్‌పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. తర్వాత పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎస్ శాంతకుమారి స్వాగతం పలికిన అనంతరం సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ 76ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్షతలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయనీ, ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రుగ్మతలను పారద్రోలేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందనీ, తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేకత ఉందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజుల పాలనలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్‌లో కలిపే ప్రక్రియను నాటి ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. తెలంగాణ నేలపై పలు సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయన్నారు. అనేక మంది పోరాట యోధులు ప్రాణాలను తృణప్రాయంగా భావించి.. గుండెలు ఎదురొడ్డి నిలిచారనీ, ఆనాటి ప్రజా పోరాటాలు, త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తాయని చెప్పారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురంభీం, రావి నారాయణరెడ్డి లాంటి ఎందరో యోధుల త్యాగాల ఫలితంగా మనం నేడు స్వేచ్ఛా వాయువులను పీల్చగలుగుతున్నామని వివరించారు. ఆ సందర్భంగా అనేక మంది ప్రాణాలర్పించారనీ, ఆ త్యాగధనుల స్ఫూర్తిని స్మరించుకోవాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో వ్యవసాయానికి ఎంతో లబ్ది చేకూరిందనీ, ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఆ పథకాన్ని పట్టించుకోలేదని చెప్పారు. పాలమూరు జిల్లాలో కరవును తరిమికొట్టామనీ, ఇప్పుడు పాలమూరు సస్యశ్యామలమవుతోందన్నారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, వరంగల్ జిల్లాకు కూడా అదనంగా సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, త్వరలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చామని, ఏటా 10 వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నామన్నారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామనీ, లబ్దిదారుల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించామని సీఎం గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకంతో ఆయా వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు. ఆదివాసీలకు పోడుభూముల పట్టాలు ఇచ్చామని తెలిపారు. వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే మేటిగా ఎదిగిందని వివరించారు. హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియాగా వర్థిల్లుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ సంతోశ్‌కుమార్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.