ప్రియాన్షు శతకం

Priyanshu's century– చెన్నైపై పంజాబ్‌ కింగ్స్‌ గెలుపు
– పంజాబ్‌ 219/6, చెన్నై 201/5
నవతెలంగాణ-ముల్లాన్‌పూర్‌
ఐదుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతుంది. ఛేదనలో వరుసగా విఫలమవుతున్న సూపర్‌కింగ్స్‌ ముల్లాన్‌పూర్‌లోనూ చేతులెత్తేసింది. 220 పరుగుల భారీ ఛేదనలో 201 పరుగులే చేసింది. 18 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఐపీఎల్‌18లో ఐదు మ్యాచుల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాల్గో పరాజయం కాగా నాలుగు మ్యాచుల్లో పంజాబ్‌ కింగ్స్‌కు ఇది మూడో విజయం.
పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ ప్రియాన్షు ఆర్య (103, 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) శతక మోత మోగించాడు. సూపర్‌కింగ్స్‌ బౌలర్లపై విశ్వరూపం చూపించిన ప్రియాన్షు ఆర్య ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. లోయర్‌ ఆర్డర్‌లో శశాంక్‌ సింగ్‌ (52 నాటౌట్‌, 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్కో జాన్సెన్‌ (34 నాటౌట్‌, 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం మెరవటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్‌ టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ విఫలమైనా.. ప్రియాన్షు ఆర్య, శశాంక్‌ సింగ్‌ ఆ జట్టుకు భారీ అందించారు. ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (0), శ్రేయస్‌ అయ్యర్‌ (9), మార్కస్‌ స్టోయినిస్‌ (4), నెహల్‌ వదేరా (9), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (1)లు విఫలమయ్యారు. ఛేదనలో సూపర్‌కింగ్స్‌ ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (36), డెవాన్‌ కాన్వే (69) రాణించినా.. ఆశించిన వేగంతో పరుగులు రాబట్టలేదు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) నిరాశపరిచినా.. శివం దూబె (42) ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఆఖర్లో ఎం.ఎస్‌ ధోని (27) మూడు సిక్సర్లతో మెరిసినా.. అప్పటికే మ్యాచ్‌ పంజాబ్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు చెన్నై 201 పరుగులు చేసింది.

Spread the love