Wednesday, April 22, 2026
E-PAPER
Homeసినిమానిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

- Advertisement -

ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు త్రిపురనేని చిట్టిబాబు (71) ఇకలేరు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసు పత్రికి తరలించారు. మంగళవారం గుండెపోటుతో చిట్టిబాబు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.
ప్రముఖ రచయిత త్రిపురనేని మహారధి కుమారుడే చిట్టిబాబు. 1955లో ఆయన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. 17 ఏళ్ళ వయసులోనే ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఆయన దాదాపు 47 చిత్రాలకు సహ దర్శకుడిగా పని చేశారు. 1984లో ‘సంతానం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా ‘నా పేరు దుర్గ, ప్రళయం, ప్రేమించి చూడు’ వంటి తదితర 12 వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. తమ్మారెడ్ది భరద్వాజ దర్శకత్వంలో నిర్మాతగా ‘రైతు భారతం’ చిత్రాన్ని నిర్మించారు. కథానాయిక సౌందర్య ఈ చిత్రంతోనే నటిగా తెరకు పరిచయం అయ్యారు. దర్శకులు కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు, శోభన్‌, సినిమాటోగ్రాఫర్‌ రసూల్‌ ఎల్లోర్‌, విజయన్‌, పరుచూరి బ్రదర్స్‌, శివప్రసాద్‌ తదితరులను చిట్టిబాబు సినీ రంగానికి పరిచయం చేశారు. 1976లో ‘గరుడాచలం’ చిత్రంతో ప్రారంభమైన ఆయన నట ప్రయాణం ఇటీవలి కాలం వరకు కొనసాగింది. ‘భైరవ ద్వీపం, దశావతారం’ వంటి సినిమాలతో పాటు రీసెంట్‌గా విడుదలైన ‘జాతిరత్నాలు, జాంబీరెడ్డి, దర్జా’ సినిమాల్లోనూ నటించారు. నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 30 చిత్రాల్లో నటించారు. సినిమా రంగంతోపాటు ప్రజానాయకుడిగానూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.
చిట్టిబాబుకి భార్య ఉషా లత, ఇద్దరు అబ్బాయిలు, ఓ కుమార్తె ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -