నల్లబ్యాడ్జీలతో ఎన్ హెచ్ ఎం ఉద్యోగస్తుల నిరసన

నవతెలంగాణ – సుల్తాన్ బజార్

ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరికీ గత మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగస్తులు వాపోయారు. ఆదివారం ఇసామియా బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగస్తులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ హెచ్ ఎం లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్, డి ఓ లు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గత మూడు నెలలుగా జీతాలు రాక మా కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా భవన్  లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో తమ గోడు వెళ్ళబోసుకొని వినతి పత్రాలు అందిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చెప్పారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఎన్ హెచ్ ఎం డైరెక్టర్ స్పందించి తమకు వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Spread the love