పేదలకు భారంగా ప్రజా రవాణా

పేదలకు భారంగా ప్రజా రవాణా– రైళ్లలో ఏసీ బోగీలకే ప్రాధాన్యత
– టిక్కెట్‌ రేట్లతో జేబుకు చిల్లులు
– సౌకర్యాల కల్పనలోనూ నిర్లక్ష్యం
– భద్రతా వైఫల్యాలతో ప్రమాదాలు
– పట్టించుకోని పాలకులు
– ఊపందుకున్న ప్రయివేటీకరణ
దేశంలో రవాణా వ్యవస్థ పేదలకు అందుబాటులో లేకుండా పోతోంది. ప్యాసింజర్‌ రైళ్లకు ఏనాడో కాలం చెల్లిపోయింది. ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. వాటిలో ఒకటో రెండో జనరల్‌ బోగీలు కన్పిస్తుంటాయి. అవి ఎప్పుడూ సాధారణ ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటాయి. తాజాగా పట్టాల పైకి ఎక్కిన వందేభారత్‌ రైళ్లలో చార్జీలు మన జేబులకు చిల్లులు పెడుతున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు… విమానాశ్రయాలు కూడా నిత్యం రద్దీగానే ఉంటున్నాయి. చివరికి ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వాస్తవ చిత్రం ఇలా ఉంటే మనం బులెట్‌ రైళ్ల గురించి కలల ప్రపంచంలో విహరిస్తున్నాము. ఇదంతా చూస్తుంటే దీవార్‌ చిత్రంలోని ఓ సన్నివేశం గుర్తొస్తుంది. ‘ఇవాళ మనకు రైళ్లు, బస్సులు, విమానాలు, క్రూయిజ్‌ ఓడలు ఉన్నాయి. లేనిదేముంది?’ అన్న ప్రశ్నకు ఆ సన్నివేశంలో వచ్చే సమాధానం ఏమిటో తెలుసా? ‘పేదలకు సీట్లు లేవు’.
ఇప్పటికీ ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం లేదు. గర్భిణులు, రోగులను నానా కష్టాలు పడుతూ ఆస్పత్రులకు తరలించాల్సిన దుస్థితి నెలకొంది. మౌలిక సదుపాయాల కల్పన పేరిట జరుగుతున్న ఆటలో సామాన్యుడితో పాటు నష్టపోతోంది ఎవరో తెలుసా? బ్యాంకులు. అవును…ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రావాల్సిన వేలాది కోట్ల పారుబకాయిలు రోడ్డు రంగానికి చెందినవే.

న్యూఢిల్లీ : గడిచిన పది సంవత్సరాల కాలంలో పేదలకు రవాణా సేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. వాటి నిర్వహణపై శ్రద్ధ పెట్టలేదు. ప్యాసింజర్‌ రైళ్లు క్రమేపీ కనుమరుగవుతు న్నాయి. వాటి స్థానంలో ఖరీదైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో కూడా స్లీపర్‌ కోచ్‌ల సంఖ్యను తగ్గిస్తూ ఏసీ బోగీలను పెంచుతున్నారు. పేదలు, కార్మికులు పిల్లాపాపలు, తట్టాబుట్టాతో ప్రయాణించేది జనరల్‌ బోగీల్లోనే. కానీ ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ బోగీల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో అమానవీయంగా మరుగుదొడ్లలో సైతం నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది.
టిక్కెట్‌ రేటు జాస్తి…సౌకర్యాలు నాస్తి
మోడీ పాలనలో రైల్వేల లాభదాయకత 7.8 శాతం తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖకు రూ.15,024.58 కోట్ల నష్టం వచ్చింది. కోవిడ్‌ సమయంలో నిలిపేసిన సీనియర్‌ సిటిజన్ల రాయితీని ఇప్పటికీ పునరుద్ధరించలేదు. ఈ రాయితీని ఆపేయడం ద్వారా గత నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వానికి రూ.5,800 కోట్ల ఆదాయం సమకూరింది. ఏసీ బోగీల రాకతో  టిక్కెట్‌ రేటు గణనీయంగా పెరిగిపోయింది. కానీ ఆ రైళ్ల వేగం, వాటిలో సౌకర్యాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇక తత్కాల్‌ టిక్కెట్‌ పొందడం భగీరథ ప్రయత్నమే. ప్రీమియర్‌ తత్కాల్‌ రేట్లు విమాన టిక్కెట్‌ రేట్లతో పోటీ పడుతున్నాయి.
భద్రతా వైఫల్యాలు
రైళ్లలో భద్రత గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరం బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 300 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే భద్రత గుర్తుకు రావడం శోచనీయం. రైలు ప్రమాదాలకు ప్రధాన కారణం పట్టాలు తప్పడమేనని మీకు తెలుసా? ఇప్పటికీ 10.000 కిలోమీటర్ల ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 98శాతం రైల్‌ నెట్‌వర్క్‌లో కవచ్‌ సిస్టమ్‌ లేనే లేదు. భద్రత కోసం ఖర్చు చేయాల్సిన సొమ్ము పక్కదారి పడుతోందని గత సంవత్సరం కాగ్‌ వేలెత్తిచూపింది. సరకు రవాణా రైళ్ల వేగం పెరిగిందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవానికి అది తగ్గిపోయింది. 2010-11లో గంటకు 27.2 కిలోమీటర్ల వేగంతో నడిచిన గూడ్సు రైలు 2019-20లో 24.4 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడిచింది.
అధ్వానంగా ప్రజా రవాణా
కోట్లాది రూపాయల విలువైన రైల్వే ఆస్తులు ఇప్పుడు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. అదానీకి దేశంలోనే అత్యంత పొడవైన (300 కిలోమీటర్లు) రైల్వే లైను ఉంది. రైల్వేలో ప్రస్తుతం మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన ప్రభుత్వం, సిబ్బందితో అదనపు గంటలు పని చేయిస్తోంది. దీంతో సిబ్బందిపై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైల్వేల పనితీరును గమనించిన ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తున్నారు. బస్సు టాపులు, ఫుట్‌బోర్డులపై ఎక్కి ప్రయాణించడం నిత్యకృత్యమైపోయింది. ఒడిశా, గోవా వంటి రాష్ట్రాల్లో ప్రజా రవాణాను అభివృద్ధి చేయలేదు. అక్కడ ప్రభుత్వ బస్సులు కన్పించవు. కొన్ని రూట్లలో మాత్రం ప్రయివేటు బస్సులు తిరుగుతుంటాయి. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ బస్సులు తిరుగుతున్నప్పటికీ సమయపాలన కన్పించదు. బస్సులను తరచూ రద్దు చేస్తుంటారు. రాజకీయ నాయకులకు మాత్రం బస్సులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. వాటిలోనే సభలకు జనాన్ని తరలిస్తుంటారు.
రహదారుల ప్రయివేటీకరణ
కొన్ని రాష్ట్రాల్లో రహదారుల ప్రయివేటీకరణ జరుగుతోంది. హర్యానా, కర్నాటక, తమిళనాడు, ముంబయిలో రోడ్‌వేస్‌ ఉద్యోగులు సమ్మెలు చేయడంతో బస్సు సర్వీసులు ఇప్పటికీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బస్‌స్టాండ్‌లను ప్రయివేటీకరించాలని యోచిస్తోంది. ప్రయివేటు బస్సుల్లో స్టూడెంట్‌ పాసులు, సీనియర్‌ సిటిజన్‌ పాసులు, ఉచిత సేవలు అనేవే ఉండవు. అధ్వానంగా ఉండే రోడ్లను చూస్తుంటే దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎందుకు వెనుకబడి ఉన్నదో అర్థమవుతుంది. 2022 నాటికి జాతీయ రహదారుల సంఖ్యను రెట్టింపు చేయాల్సి ఉంది. కానీ వాస్తవమేమిటో మనకు తెలుసు. జాబితాలో రాష్ట్ర రహదారులను చేర్చి జాతీయ రహదారుల సంఖ్యను ఎక్కువగా చూపుతున్నారు. అనేక రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు నత్తనడక నడుస్తుండడంతో వాటి నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. ఎన్నికల బాండ్ల ద్వారా అధికార పార్టీకి విరాళాలు సమకూర్చిన వారికే నిర్మాణ ప్రాజెక్టులు దక్కాయి.
అభివృద్ధి ఆటలో పావులుగా బ్యాంకులు
అభివృద్ధిపై పాలకులు ఎన్ని హామీలు కుమ్మరిస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం లేదు. గర్భిణులు, రోగులను నానా కష్టాలు పడుతూ ఆస్పత్రులకు తరలించాల్సిన దుస్థితి నెలకొంది. మౌలిక సదుపాయాల కల్పన పేరిట జరుగుతున్న ఆటలో సామాన్యుడితో పాటు నష్టపోతోంది ఎవరో తెలుసా? బ్యాంకులు. అవును…ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రావాల్సిన వేలాది కోట్ల పారుబకాయిలు రోడ్డు రంగానికి చెందినవే. దేశంలో రవాణా సౌకర్యాలు తగినంతగా లేవని, అవి ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయని, నిర్వహణ అధ్వానంగా ఉంటోందని గత సంవత్సరం నిర్వహించిన ఓ సర్వేలో 85 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.

Spread the love