– తద్వారా వైద్య బీమా రంగంలోకి ప్రవేశం
న్యూఢిల్లీ : వైద్య బీమా రంగంలోకి ప్రవేశించడానికి ప్రభుత్వ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ చేస్తోన్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. ఇందుకోసం మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో మైనారిటీ వాటా కొనుగోలుకు తుది కసరత్తు చేస్తోందని ఆంగ్ల మీడియాలో రిపోర్టులు వస్తోన్నాయి. మణిపాల్ సిగ్నాలో 40- 49 శాతం వాటాను కొనుగోలు చేయనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీని విలువ రూ.3,500-3,750 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వైద్య బీమాలోకి ప్రవేశించనున్నట్టు ఇటీవలే ఎల్‌ఐసీ చైర్మెన్ సిద్దార్థ మోహంతి వెల్లడించారు. ఈ నెలాఖరు కల్లా స్పష్టత ఇవ్వనున్నామని చెప్పారు. మణిపాల్ సిగ్నాలో మైనారిటీ వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ ఇప్పటికే సూత్రప్రాయంగా బోర్డు ఆమోదం పొందిందని తెలుస్తోంది. ఎల్‌ఐసీ విలువ, బోర్డు నిర్ణయాలు ఇతరత్రా అవకాశాల్ని పరిగణనలోకి తీసుకొని వైద్య బీమా సంస్థలో వాటా కొనుగోలు ఉంటుందని మోహంతి తెలిపారు. బీమా రంగంలోకి ప్రవేశించడం ద్వారా తన ఉనికిని మరింత విస్తరించుకోవాలని ఎల్‌ఐసి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఎల్‌ఐసీ నికర లాభాలు 17 శాతం పెరిగి రూ.11,056 కోట్లకు చేరాయి. గురువారం బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేర్ విలువ 1.79 శాతం పెరిగి రూ.800.65 వద్ద ముగిసింది.