లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన రాహుల్ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ, ఆ పార్టీ నేతలు హిందువులే కాదని… వారు నిరంతరం హింస, ద్వేషం గురించే ఆలోచిస్తుంటారని రాహుల్ లోక్ సభలో ధ్వజమెత్తారు. అయితే, నిన్నటి రాహుల్ ప్రసంగంలోని చాలా భాగాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో తొలగించిన భాగాన్ని రికార్డుల్లో పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రికార్డుల నుంచి తన ప్రసంగంలో అత్యధిక భాగాన్ని తొలగించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని పేర్కొన్నారు. తాను ప్రజాస్వామ్య విలువలకు లోబడి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసివేయడం పార్లమెంటరీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అంతకుముందు కూడా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మోడీ ప్రపంచంలో ‘వాస్తవం’ అనే అంశానికి తావు లేదని, ఒకవేళ ఆయన ప్రపంచంలో ‘వాస్తవం’ అనేది ఉంటే తొలగిస్తుంటారని విమర్శించారు. కానీ నిజ జీవితంలో ‘వాస్తవం’ అనే అంశాన్ని ఎవరూ తొలగించలేరని రాహుల్ ఉద్ఘాటించారు.

Spread the love