సంస్కరణల సృష్టికర్త రాజీవ్ గాంధీ..

నవతెలంగాణ – రాయపర్తి
టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు.. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనుడు.. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని మంగళవారం మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. కంప్యూటర్ రంగాన్ని దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకునేలా చేసింది మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. గ్రామాల అభివృద్ధికి రాజీవ్ ఎంతగానో కృషి చేశారు అని వివరించారు. ఐటీ రంగంలో ఈనాడు దేశం అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ సంకల్ప ఫలితమే అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఆలయ చైర్మన్ రామకృష్ణ చార్యులు, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, నర్సయ్య, యాకుబ్, కుమారస్వామి, ఆఫ్రోస్, శ్రీనివాస్, వెంకట్, రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love