నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం రాజీవ్ గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువతకు ఆయన ఆదర్శమూర్తి అని తెలిపారు. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ యువత రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించేవారని అన్నారు. యువతకు అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారని గుర్తుచేశారు. అలాగే సమాచార సాంకేతిక రంగంలో కొత్త ఒరవడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అలే మల్లికార్జున్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, కౌన్సిలర్లు అన్వర్, షేరు, రామ్మోహన్, గణేష్, సత్యం, సిద్దిక్, వాజిద్, అంజాద్, లడ్డు, సాయిలు, జావీద్, బబ్లు, మోతీలాల్, కో-ఆప్షన్ సభ్యులు గొనె సునీత శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, చాట్ల రాజేశ్వర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



