రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు

– స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీల ప్రక్రియ షురూ
– జులై 2న ప్రమోషన్ల ఉత్తర్వులు
– షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. మల్టీజోన్‌-1లో 11,177 మంది, మల్టీజోన్‌-2లో 7,765 మంది కలిపి మొత్తం 18,942 మంది ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. హైకోర్టులో కేసు ఉండడంతో రంగారెడ్డి జిల్లాలో అప్పుడు ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమమైంది. 40 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఖాళీగా ఉంచాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. జిల్లా పరిషత్‌, ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి శుక్రవారం ఖాళీల వివరాలను ప్రకటించాలని కోరారు. అదేరోజు ఎస్జీటీలు, తత్సమా క్యాడర్‌కు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాను విడుదల చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం అభ్యంతరాలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అదే రోజు వాటిని డీఈవో పరిష్కరిస్తారని తెలిపారు. ఈనెల 30న తుది సీనియార్టీ జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయుల నుంచి వెబ్‌ఆప్షన్లను స్వీకరిస్తామని పేర్కొన్నారు. అదేరోజు బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తామని వివరించారు. వచ్చేనెల ఒకటిన స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీల వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల కోసం తుది సీనియార్టీ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. అదేనెల రెండున వెబ్‌ఆప్షన్లను స్వీకరిస్తామనీ, సవరణకు అవకాశమిస్తామని వివరించారు. అదేరోజు పరిశీలించి పదోన్నతుల ఉత్తర్వులను జారీ చేస్తామని తెలిపారు. వచ్చేనెల మూడు నుంచి ఐదో తేదీ వరకు ఎస్జీటీలకు బదిలీల ప్రక్రియను చేపడతామని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది రోజుల్లో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను చేపట్టేందుకు షెడ్యూల్‌ను విడుదల చేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం ప్రకటించాయి.

Spread the love