నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొంతకాలంగా సరైన విజయం లేక వరుస ఫ్లాపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాస్ మహారాజా రవితేజ, ‘ఇరుముడి’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద గట్టిగా కంబ్యాక్ ఇచ్చారు. సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చూసి థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా, రవితేజ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 24.20 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరొక క్రేజీ ఘనతను సొంతం చేసుకుంది. కేవలం రెండు రోజుల్లోనే నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా నిలిచి అందరినీ మెప్పించింది. ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్‌లో రవితేజ పేరు మీద ఉన్న పాత రికార్డులన్నింటినీ ‘ఇరుముడి’ తుడిచిపెట్టేసింది. కాగా.. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటనతో మెప్పించగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో జీవించేసి అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన అద్భుతమైన పాటలు, సంగీతం ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రవితేజ కెరీర్‌లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.



