నవతెలంగాణ-హైదరాబాద్ : సీపీఐ(ఎం) అనుబంధ యువజన విభాగం ‘డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (డీవైఎఫ్ఐ) కేరళం విభాగం చరిత్రలో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలిగా తొలిసారి ఒక మహిళా నేత ఎన్నికయ్యారు. త్రిశూర్‌లో జరిగిన 16వ రాష్ట్ర మహాసభలో చింతా జెరోమ్‌ను ఈ కీలక బాధ్యతలకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఏ.ఏ. రహీం అధికారికంగా ప్రకటించారు.
నూతన కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కల్లియాస్సేరి ఎమ్మెల్యే, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎం. విజిన్‌ను, కోశాధికారిగా ఆర్. రాహుల్‌ను నియమించారు. కొల్లాం జిల్లాకు చెందిన చింతా జెరోమ్.. ఎస్‌ఎఫ్‌ఐ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. కేరళ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ పొందిన ఆమె, ప్రస్తుతం డీవైఎఫ్ఐ కేంద్ర కమిటీతో పాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
మరోవైపు, తిరువనంతపురం మాజీ మేయర్ ఆర్య రాజేంద్రన్‌కు 25 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర సెక్రటేరియట్‌లో చోటు దక్కింది. ఆమె భర్త, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కే. సచిన్ దేవ్‌కు నూతన ఉపాధ్యక్షులలో ఒకరిగా అవకాశం కల్పించారు.



